తెలంగాణ రాష్ట్రంలో పేదింటి ఆడపడుచులపట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన ప్రేమానురాగాలను మరోసారి చాటుకొన్నారు. పేదింటి ఆడబిడ్డ పెండ్లి కోసం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద ప్రభుత్వం ఇప్పటివరకు అందిస్తున్న రూ.75,116 సహాయాన్ని 1,00116 పెంచుతున్నట్టు సోమవారం శాసనసభలో ప్రకటించారు. వ్యక్తిగతంగా తన హృదయానికి ఎంతో దగ్గరైన పథకం కల్యాణలక్ష్మి అని ఈ సందర్భంగా ఆయన అన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు తీసుకొంటున్న సమయంలో తమకందిన సహాయానికి సంతోషిస్తూ, ఆడపిల్లల తల్లులు ఆనందబాష్పాలతో ప్రభుత్వాన్ని దీవిస్తున్నారని సంతోషం వ్యక్తంచేశారు.
ఈ పథకం ఆర్థిక సహాయం పెంపు నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించిన వెంటనే సభ్యులంతా హర్షం వ్యక్తంచేశారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన ఆయన మాటల్లోనే.. పేదరికం మనుషుల్ని అనేక రకాలుగా వేధిస్తుంది. పేదరికంతో బాధపడేవారికి కొన్నిసార్లు సంప్రదాయాలు కూడా భారంగా పరిణమిస్తాయి. మన సమాజంలో పెండ్లి అనేది చాలా ఖర్చుతో కూడుకొన్న అంశం. అందులోనూ ఆడపిల్ల పెండ్లి మరింత భారంగా మారిపోయింది. ఈ భారం వల్లనే చాలామంది తల్లిదండ్రులు తమ ఇంటి మహాలక్ష్మిగా గౌరవించే ఆడపిల్లను గుండెలమీద కుంపటిగా భావించే మానసికస్థితిలోకి పడిపోతున్నా రు.
కొన్నిసార్లు పేదల ఇండ్లల్లో ఆడపిల్లలు పెండ్లి కాకుండానే మిగిలిపోతున్నారు. ఆడపిల్ల పెండ్లి చేయడంకోసం కుటుంబాలు అప్పులపాలవుతున్నాయి. ఆర్థికంగా చితికిపోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఆడపిల్లలు ఎదుర్కొంటున్న కష్టాన్ని, వారి తల్లిదండ్రులు అనుభవిస్తున్న ఆవేదనని తీర్చాలని భావించింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీ కాకున్నా, పేదరికం ప్రభావాలను అధ్యయనంచేసే క్రమంలో పరిస్థితిలోని తీవ్రత మమ్మల్ని కదిలించింది. అందుకే పేద ఆడపిల్లల పెండ్లికి ప్రభుత్వం ఆర్థికంగా అండదండగా నిలువాలని నిర్ణయించాం. కల్యాణలక్ష్మి అనే శుభప్రదమైన పేరుతో 2014 అక్టోబర్ 2న ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టాం.
కల్యాణలక్ష్మి వ్యక్తిగతంగా నా హృదయానికి ఎంతో దగ్గరైన పథకం. అంతకంటే ఎక్కువగా ఈ రాష్ట్ర ప్రజలు మెచ్చిన పథకం. మొదట ఈ పథకాన్ని కల్యాణలక్షి పేరుతో ఎస్సీ,ఎస్టీలకు, షాదీముబారక్ పేరుతో మైనార్టీ వర్గాల ఆడపిల్లల పెండ్లికి రూ.51,000 అందించే పథకంగా ప్రారంభించాం. ఆ తర్వాత ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు సామాజికవర్గంతో నిమిత్తం లేకుండా రాష్ట్రంలోని నిరుపేదలందరికీ వర్తింపచేశాం. ప్రభుత్వం తీసుకున్న ఈ మంచి నిర్ణయానికి ఆడపిల్లలు, వారి తల్లిదండ్రుల నుంచే కాకుండా, సమాజహితం కోరే వారందరినుంచి హర్షామోదాలు లభిస్తాయని విశ్వసిస్తున్నాను. వారి ఆశీర్వాదమే కొండంత అండగా సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతున్నామని సవినయంగా తెలియజేస్తున్నాను అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇక కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద ఆర్థికసాయాన్ని రూ.75,116 నుంచి లక్షా నూట పదహారు రూపాయలకు పెంచిన సీఎం కేసీఆర్‌కు మహిళలు, తెలంగాణ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.