జీహెచ్ఎంసీ అక్రమకట్టడాల కూల్చివేత ఆగలేదని, సర్వే కొనసాగుతోందని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మల్లారెడ్డి కాలేజీని కూడా కూల్చడానికి వెళ్లారని, బీఆర్ఎస్ కట్టి ఉండడం వల్ల ఆగిపోయారని ఆయన చెప్పారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను సిరిసిల్ల, వేములవాడలను కలిపి రాజన్న జిల్లా చేయాలని కమిటీని కోరినట్లు తెలిపారు. రుద్రంగిని మండలం చేయాలని కోరినట్లు చెప్పారు. గతంలో దివంగత ఎన్టీఆర్ మండలాలను ఏర్పాటు చేసినప్పుడు జోకులు వేశారని, సినిమాలు కూడా తీశారని… ఎన్నో విమర్శలు వచ్చాయన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల కొత్త ఉద్యోగాలు వస్తాయని అన్నారు. ప్రభుత్వం కొత్త జిల్లాలు ప్రజల కోసమే చేపడుతుందని… ప్రభుత్వం చేపడుతోన్న అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలు ప్రతికుటుంబానికి అందుతాయని చెప్పారు.
హైదరాబాద్‌ను జిల్లాలుగా విభజించకపోవడానికి కారణం, నగరంలో రెవెన్యూ శాఖకు పెద్దగా పని లేకపోవడమేనని కేటీఆర్ అన్నారు. జీహెచ్ఎంసీని ప్రక్షాళన చేస్తామని అన్నారు. 24 నుంచి 30 సర్కిళ్లుగా విభజిస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో రోడ్ల కాంట్రాక్ట్ వ్యవస్థను మారుస్తామని… గ్రేటర్ పరిధిలో వైట్ మ్యాపింగ్ రోడ్లను ఎక్కువగా తీసుకు వస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అవసరమని అన్నారు.
అక్రమ కూల్చివేతలను టీఆర్‌ఎస్ కార్పోరేటర్లైనా సరే అడ్డకుంటే సస్పెండ్ చేసేందుకు కూడా వెనకాడమని అన్నారు. నయీంని పెంచి పోషించింది గత పాలకులేనని కేటీఆర్ విమర్శించారు. నయీమ్ ఎన్‌కౌంటర్‌తో ఎవరికి హెచ్చరికలు వెళ్లాలో వారికి వెళ్లాయని పేర్కోన్నారు. ఇప్పటివరకు రెండు వేల అక్రమ కట్టడాలు కూల్చివేశామని అన్నారు. ఈనెల 14న టీహబ్ శాఖను టీ బ్రిడ్ పేరుతో అమెరికాలో ప్రారంభిస్తున్నామని చెప్పారు. నయీమ్ అరాచకాలకు టీఆర్ఎస్ చెక్ పెట్టిందని కేటీఆర్ అన్నారు.