తెలంగాణ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన బర్రెల పంపిణీ పథకాన్ని శనివారం వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో లాంఛనంగా ప్రారంభించారు. మహిళా పాల డెయిరీలో ఏర్పాటుచేసిన పాడిపశువుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి తలసాని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆర్థికమంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్‌కుమార్,కలెక్టర్ అమ్రపాలి తదితరులు పాల్గొన్నారు.
ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఎవరెన్ని రకాల విమర్శలు చేసినా తాము ప్రజలకోసం చేయాల్సింది చేసి తీరుతామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ స్పష్టం చేశారు. సంక్షేమపథకాల ద్వారా ప్రజలకు లబ్ధిచేకూరుస్తున్నామని, కులవృత్తులకు పూర్వవైభవం కల్పిస్తున్నామని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా వంద బర్రెలను పంపిణీ చేశారు. ఒక్కో బర్రెధర రూ.80వేలు కాగా, యాభైశాతం సబ్సిడీపై అందజేశారు. కార్యక్రమంలో మంత్రి తలసాని మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికీ లేని ధైర్యం మన సీఎంకు ఉందని కొనియాడారు. ఇదివరకే గొర్రెల పంపిణీని చేపట్టిన సీఎం పాల ఉత్పత్తిని పెంచి అనేక కుటుంబాల్లో కరువును పారదోలేందుకు పాడిపశువుల పంపిణీపథకాన్ని ప్రకటించారని చెప్పారు. పాలకు ప్రభుత్వం తరుపున లీటరుకు రూ.4 చొప్పున ప్రోత్సాహం ఇచ్చామని, ఇప్పుడు రూ.900 కోట్లతో 2.13 లక్షల మందికి పాడిపశువులను ఇస్తున్నామని మంత్రి తెలిపారు.