రాష్ట్ర వ్యాప్తంగా రేపు జరుగబోయే మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వి. నాగిరెడ్డి. మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు. 120 మున్సిపాలిటీలు, 9 కార్పోరేషన్లలో రేపు ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగనుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించాలని సూచించారు.టెండర్ ఓటు వేస్తే రీ పోలింగ్ తప్పనిసరి నిర్వహిస్తామని చెప్పారు. దొంగ ఓట్లు వేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
టెండర్ ఓటు వేసిన చోట ఓట్ల లెక్కింపు జరగనివ్వమని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో అధికారులతో పాటు పార్టీల నేతలు కూడా సహకరించాలని ఆయన పేర్కొన్నారు. అభ్యర్థులు ఎన్నికల ఖర్చు వివరాల్లో తప్పుడు సమాచారం చూపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.పోలింగ్ కేంద్రాల్లో పోటీ చేసే అభ్యర్థి వివరాలను నోటీసు బోర్డులో ఉంచుతామనీ.. అభ్యర్థుల గత చరిత్ర, నేర చరిత్ర, ఆస్తుల వివరాలు అందుబాటులో ఉంచుతామని ఆయన వెల్లడించారు.