జీహెచ్ఎంసీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తాం- ఈసీ

164
ec
- Advertisement -

రాబోవు జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్బంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో వార్డుల వారీ ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, మోడల్ కోడ్, అభ్యర్థుల ఎన్నికల ఖర్చు తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారధి చర్చించారు. గురువారం (12-11-2020) రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత జీహెచ్ఎంసీ పదవీకాలం 10.2.2021 నాటికి ముగుస్తుందని, ఈ లోపు ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘంపై ఉన్నదన్నారు.

జీహెచ్ఎంసీలోని 150 వార్డులకు ముసాయిదా ఓటర్ల జాబితాను 7.11.2020న సంబంధిత డిప్యూటీ కమిషనర్లు ప్రచురించారని, అభ్యంతరాలను పరిష్కరించి తుది జాబితా 13.11.2020న ప్రచురిస్తారన్నారు. వార్డుల వారీ ఓటర్ల జాబితా ఆధారంగా పోలింగ్ స్టేషన్లను గుర్తించి 13.11.2020న ముసాయిదా సంబంధిత రిటర్నింగ్ అధికారులు ప్రచురిస్తారని, అభ్యంతరాలు, సలహాలు సూచనలు స్వీకరించి, పరిష్కరించి 21.11.2020 న తుది పోలింగ్ కేంద్రాల జాబితా ప్రచురిస్తారన్నారు.

ఎన్నికల నిర్వహణకు అవసరమైన రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులను నియమించడం జరిగిందని, నోటిఫికేషన్ విడుదల చేసినప్పటినుండి ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని, దీనిని అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తప్పక పాటించాలని, సంయమనం పాటిస్తూ, వ్యక్తిగత దూషణలు చేసుకోకుండా రాష్ట్ర ఎన్నికల సంఘానికి సహకరించాలన్నారు. పోటీచేయు అభ్యర్థులు జీహెచ్ఎంసీలో ఓటరుగా నమోదై ఉండాలని, 2016 ఎన్నికల్లో నిర్ణయించిన వార్డుల రిజర్వేషన్లు కొనసాగుతాయన్నారు.

రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ.. వార్డు వారీ ఓటర్ల జాబితాలు సక్రమంగా తయారు చేసిన తరువాత ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేసారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ అన్ని అభ్యంతరాలు, సలహాలు స్వీకరించి, పరిష్కరించి ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని, అభ్యర్థులు, రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు.దీనికొరకై సీనియర్ అధికారులను ఎన్నికల పరిశీలకులుగా నియమించడం జరుతుందన్నారు.

వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల అభ్యంతరాలను పరిగణనలోనికి తీసుకొని రాష్ట్ర ఎన్నికల కమిషనరు వార్డు వారీ ఓటర్ల తుది జాబితా ప్రచురణలోపు వార్డు డీలిమిటేషన్ బౌండరీల ప్రకారం ఆ వార్డులో నివసించే ఓటర్ల౦దరిని ఆ వార్డులోనే చేర్చాలని, ఒక వార్డు ఓటరు ఇంకో వార్డులో ఉండరాదని, ఒక కుటుంబంలోని ఓటర్లంతా ఒకే వార్డులో ఉండేలా ఖచ్చింతంగా నిర్ధారించుకోవాలని ఎన్నికల ఆథారిటీ మరియు జిహెచ్ఎంసి కమిషనరును, డిప్యుటీ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్, జాయింట్ సెక్రటరీ జయసింహా రెడ్డి, జాయింట్ డైరెక్టర్ విష్ణు ప్రసాద్, జాతచేసిన లిస్టులోని 11 పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -