తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4737కి చేరింది. గత 24 గంటల్లో 253 పాజిటివ్ కేసులు నమోదుకాగా హైదరాబాద్ పరిధిలోనే 179 ఉన్నాయి. ఇప్పటివరకు 182 మంది మృతిచెందగా సంగరెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఒకే కుటుంబానికి చెందిన 19 మందికి వైరస్ సోకింది.
జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్‌గా వచ్చింది. మేయర్ కారు డ్రైవర్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో శుక్రవారం ఆయనకు పరీక్షలు నిర్వహించగా, శనివారం వచ్చిన నివేదికలో వైరస్ సోకలేదని తేలింది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి దంపతులకు కరోనా సోకింది.
మాస్కులు ధరించకపోవడం, భౌతికదూరం పాటించకపోవడం వంటి కారణాలతోనే రాష్ట్రలో కేసులు పెరుగుతున్నాయని ప్రజారోగ్యశాఖ ఆందోళన వ్యక్తంచేసింది.ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, ఆరు ఫీట్ల భౌతికదూరం పాటించాలని విజ్ఞప్తిచేసింది. పని స్థలాల్లో చేతులు శుభ్రం చేసుకొనేందుకు సబ్బు లు, శానిటైజర్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, ఉద్యోగులు భౌతికదూరం పాటిస్తూ పనులు చేసుకోవాలని పేర్కొంది.