రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్‌‌కు గడ్డు పరిస్థితి..!

239
chinna reddy
- Advertisement -

తెలంగాణలో మరి కొద్ది రోజులలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోలింగ్‌కు ముందే కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసింది. ఆ పార్టీ సీనియర్ నేతల తీరుతో రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో హస్తం గడ్డుపరిస్థితి ఎదుర్కొంటోంది. పాలమూరు, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి చిన్నారెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ గెలుపుపై కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది. అయితే చిన్నారెడ్డికి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ పీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్థన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. పీఆర్‌టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడైన హర్షవర్థన్ రెడ్డి 30 ఏళ్లుగా ఉద్యోగులు, విద్యార్థి సమస్యలపై పోరాడుతున్నారు. ఆయనకు పట్టభద్రులలో మంచి పేరు ఉంది. మరోవైపు పాలమూరు జిల్లాలోని కాంగ్రెస్ శ్రేణులు తమ పార్టీ అభ్యర్థి అయిన చిన్నారెడ్డి కంటే..హర్షవర్థన్ రెడ్డి వైపే మొగ్గుచూపుతున్నారు. ఇక్కడ తొలుత బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచందర్‌రావుకు, కాంగ్రెస్‌ పార్టీకి, ప్రొఫెసర్ నాగేశ్వర్‌రావుకు మధ్య పోటీ అనుకున్నారు. కాని టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా పీవీ కుమార్తె వాణీదేవిని పోటీలోకి దింపడంతో ఓటర్ల సరళి ఒక్కసారిగా మారింది.

మెల్లగా పట్టభద్రులు బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు బదులుగా విద్యావేత్త అయిన వాణిదేవి వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం..పాలమూరు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వెనుకబడిపోయింది. దీనికి కారణం పీసీసీ అధ్యక్ష పదవి రేవంత్‌రెడ్డికి కట్టబెడుతున్నారన్న వార్తలతో తీవ్ర అసంతృప్తికి గురైన కాంగ్రెస్ సీనియర్లు కీలక సమయంలో ప్రచారానికి డుమ్మాకొడుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ స్థానంలో అభ్యర్థి రాములు నాయక్‌ తరపున ప్రచారంలో తలమునకలై ఉన్నారు. పాలమూరు స్థానంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలను రేవంత్ రెడ్డి ఒక్కరే భుజనా వేసుకున్నారు. కాంగ్రెస్​ సీనియర్లు జానారెడ్డి, వీహెచ్, జీవన్​రెడ్డి, జగ్గారెడ్డి, శ్రీధర్​బాబు, షబ్బీర్​అలీ, మధుయాష్కి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వంటి నేతలు ఇప్పుడు ప్రచారంలో అభ్యర్థులతో కలిసి రావడం లేదు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మొదట్లో ప్రచారానికి వెళ్లినా… ఆ తర్వాత దూరంగానే ఉంటున్నారు. హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలంతా కాషాయగూటికి చేరుతుండడంతో కీలక నేతలు ఎవరూ ప్రచారంలో కనిపించడం లేదు. మల్లురవి, సీతక్క లాంటి నేతలను వెంటపెట్టుకుని రేవంత్‌రెడ్డి చిన్నారెడ్డి గెలుపు కోసం ఒంటరి పోరాటం చేస్తున్నారు.

మరోవైపు నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల స్థానంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ ప్రచారంలో పూర్తిగా వెనుకబడిపోయారు. . నల్గొండ జిల్లా నుంచి జానారెడ్డి, ఉత్తమ్​, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, రాజగోపాల్​రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఉన్నప్పటికీ.. ఉత్తమ్​మినహా మిగతా నేతలు ఎవ్వరూ ప్రచారం వైపు కన్నెత్తి చూడలేదు. కనీసం మీడియాలో కూడా తమ అభ్యర్థిని గెలిపించండి అంటూ ప్రెస్‌మీట్లు కూడా పెట్టడం లేదు. మరోవైపు అధికార టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతుండడం, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి కూడా ప్రచారంలో జోరు పెంచడం, కోదండరామ్, రాణిరుద్రమ, తీన్మార్ మల్లన్న వంటి నేతలు సవాల్ విసురుతుండడం..దానికి తోడు సీనియర్లు ప్రచారానికి ముఖం చాటేయడంతో ఇక్కడ గెలుపుపై హస్తం పార్టీ దాదాపుగా ఆశలు వదిలేసుకుందంట.. అసలే రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్తిగా దెబ్బతిని ఉంది.

రేవంత్‌రెడ్డి పాదయాత్ర తర్వాత కాస్త పార్టీ పుంజుకునే సమయంలో ఇలా సీనియర్ నేతలంతా విబేధాల నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు వంటి కీలక సమయంలో పార్టీ సీనియర్ నేతలు చేతులెత్తేయడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రచారానికి రావాలని ఇప్పటికే సీనియర్లను కోరినా వారు రావడం లేదని అటు చిన్నారెడ్డి, ఇటు రాములు నాయక్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మాణిక్యం ఠాగూర్‌కు ఫిర్యాదు చేశారంట. మరోవైపు ఉత్తమ్ సైతం ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. మొత్తం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోలింగ్ కు ముందే కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసిందని, రెండు స్థానాల్లో ఘోర ఓటమిని కూడగట్టుకోవడం ఖాయమని హస్తం పార్టీ వర్గాలు అంగీకరిస్తున్నాయి. మొత్తం కాంగ్రెస్ సీనియర్ నేతలు కీలక సమయంలో రిక్తహస్తం చూపడంతో ఆ పార్టీ అభ్యర్థులు నిరాశ, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతూ..ఏదో నామమాత్రంగా ప్రచారం చేస్తూ మమ అనిపిస్తున్నారు.

- Advertisement -