జై శ్రీరాం నినాదానికి మమతా చెక్….!

81
didi

బీజేపీ నేతలు పొద్దున లేస్తే జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ హిందూత్వానికి అసలైన బ్రాండ్ అంబాసిడర్లు అంటూ ఫోజులు కొడుతుంటారు. అసలు శ్రీరాముడు భారతీయులందరికీ ఆరాధ్యదైవం. కుల, మతాలకు అతీతంగా రాముడిని దైవంగా పూజిస్తారు. కబీర్ దాసు వంటి ముస్లిం గొప్ప రామభక్తుడిగా వెలుగొందిన నేల ఇది. అయోధ్య వివాదం శాంతియుతంగా పరిష్కారం అయిందంటే ముస్లింలు శ్రీరాముడి పట్ల గౌరవం చూపడం కూడా ఓ కారణమని చెప్పాలి. రామమందిర నిర్మాణంలో ముస్లింలు కూడా భాగం కావడం మన దేశంలోని లౌకికత్వానికి అద్దం పడుతోంది. జై శ్రీరామ్ అనేది ఒక్క హిందూ ధర్మానికే సంబంధించింది కాదు. అది విశ్వజనీనమైంది. శ్రీరాముడు విశ్వజనబాంధవుడు..ఒక్క భారత దేశంలోనే కాదు.. నేపాల్, శ్రీలంక, ఇండోనేషియా ఇలా అనేక దేశాల్లో రాముడిని దేవుడిలా కొలుస్తారు. జై శ్రీరామ్ అని ఒక్క సారి పలికితే చాలు మన జన్మ పునీతమవుతోంది. సకల పాపాలు తొలుగుతాయి. కాని అంతటి పవిత్రమైన జై శ్రీరామ్ నినాదాన్ని బీజేపీ నేతలు మాత్రం రాజకీయ నినాదంగా మార్చారు.

జై శ్రీరామ్ నినాదం పలకనంత మాత్రానా వారిని పరమతస్తులుగా, హిందూ ద్రోహులుగా చిత్రీకరిస్తుంటారు. రాజకీయ సభల్లో కూడా జై రామ్ అంటూ పూనకం వచ్చిన వారిలా నినాదాలు చేస్తూ రామ నామ పవిత్రతను దెబ్బతీస్తున్నారు. రామమందిర నిర్మాణంలో బీజేపీ నేతల విరాళాలపై ప్రశ్నించిన వారిపై జై శ్రీరామ్ అంటూ దాడులకు పాల్పడుతూ ఆ శ్రీరాముడికే కళంకం తెస్తున్నారు. చివరకు జై శ్రీరామ్ నినాదానికి విరుగుడుగా ఇంకో నినాదం తీసుకువచ్చే పరిస్థితిని బీజేపీ నేతలు తీసుకువస్తున్నారు. పశ్చిమబెంగాల్‌లో మమతాబెనర్జీని ఓడించి అధికారంలోకి రావాలని బీజేపీ కుటిల యత్నాలు చేస్తోంది. ఇటీవల కోల్‌కతాలో అధికారికంగా నిర్వహించిన నేతాజీ జయంతి సభలో సీఎం మమతాబెనర్జీని ప్రసంగించకుండా బీజేపీ కార్యకర్తలు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ చికాకు పెట్టించారు. బీజేపీ నేతల స్లోగన్లపై మండిపడిన మమతాదీదీ ప్రధాని మోదీ సమక్షంలోనే తన మాట్లాడనని ప్రకటించి నిరసన వ్యక్తం చేసింది. ఇక బెంగాల్ ఎన్నికలలో రామమందిర నిర్మాణం గురించి ప్రచారం చేస్తూ జై శ్రీరామ్ నినాదంతో హిందువుల ఓట్లను పోలరైజ్ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.

కాషాయ నేతలు జై శ్రీరామ్ నినాదం పేరుతో చేస్తున్న హిందూత్వ రాజకీయానికి చెక్ పెట్టేందుకు మమతా దీదీ చెక్ సిద్ధమవుతోంది. హార్డ్ కోర్ హిందూత్వను ఫాలో అవుతున్న బీజేపీకి సాఫ్ట్ హిందూత్వంతో చుక్కలు చూపించాలని దీదీ డిసైడ్ అయింది. బీజేపీ నేతల జై శ్రీరామ్ నినాదానికి విరుగుడుగా మమతాబెనర్జీ ఓం నమఃశివాయ నినాదాన్ని తెరపైకి తీసుకువస్తోంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌ నుంచి పోటీ చేస్తున్న సీఎం మమతాబెనర్జీ ఏకంగా తన నామినేషన్ కార్యక్రమానికి ముహూర్తంగా మహాశివరాత్రిని ఎంచుకుంది. మహాశివరాత్రి నాడు నామినేషన్ వేసి ఓం నమః శివాయ నినాదాన్ని ప్రాచుర్యంలోకి తీసుకువస్తోందని సమచారం. ఇక నుంచి టీఎంసీ కార్యకర్తలు ఓం నమఃశివాయ నినాదంతో బీజేపీ నేతలకు కౌంటర్ ఇవ్వడం ఖాయమైంది. బీజేపీని ఇరుకున పెట్టడానికే మహాశివరాత్రి నాడు నందిగ్రామ్‌లో మమతా నామినేషన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఎన్నికల ప్రచారం సందర్భంగా పాదయాత్ర చేసి ఓటర్లను ఆకట్టుకోవాలని మమతాదీదీ ఫిక్స్ అయిందంట.. మొత్తంగా బీజేపీ నేతల శ్రీరామ్ నినాదానికి విరుగుడుగా మమతా దీదీ ఓం నమఃశివాయ మంత్రాన్ని నినాదంగా తీసుకోవడం రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. బీజేపీ రాముడి పేరుతో చేస్తున్న రాజకీయానికి మమతాబెనర్జీ శివుడు పేరుతో చెక్ పెట్టడం చూస్తుంటే రానున్న రోజుల్లో జై రామ్ నినాదానికి ప్రత్యామ్నాయంగా ఓం నమః శివాయ నినాదం తెరపైకి వచ్చినా ఆశ్చర్యం లేదని హిందూ ధార్మిక సంఘాలు అంటున్నాయి. ఏదేమైనా మతం పేరుతో ఎవరు రాజకీయం చేసినా తప్పే…ఇకనైనా రాజకీయ పార్టీలు దేవుళ్లను తమ నీచరాజకీయాల్లోకి లాగకుంటే హిందూ ధర్మం ఔన్యత్వాన్ని కాపాడినవారు అవుతారు. కాని మతం పేరుతో కళ్లు మూసుకున్న కాషాయ నేతలకు ఈ మాటలు చెవికి ఎక్కుతాయా అనేది సందేహమే.