60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సీఎం కేసీఆర్ నెరవేర్చారు. ఉద్యమ నాయకుడిగా ముందుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తిరుగులేని పోరాటం చేశారు. అసాధ్యమనుకున్న తెలంగాణను సుసాధ్యం చేసి ఢిల్లీ పెద్దల మెడలు వంచి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ మాత్రం అలసిపోకుండా.. రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చే వరకు దీక్ష విరమించేది లేదని బైఠాయించారు. దీక్ష సమయంలో కేసీఆర్ ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు దీక్షను భగ్నం చేసి.. ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్సకు ససేమీరా అన్నారు. పట్టు వీడని విక్రమార్కుడిలా కేసీఆర్ తన దీక్షను కొనసాగించారు. చివరకు రాష్ట్రాన్ని సిద్దింపచేశారు.
రాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలంగాణలోని అనేక సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించారు. నాలుగున్నర ఏళ్ల పాటు బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేశారు. 60 ఏళ్లలో ఏ నాయకుడు చేయలేని అభివృద్ధిని నాలుగున్నర ఏళ్లలో కేసీఆర్ చేసి చూపించారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఎదుర్కొంటూ, ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ పాలన కొనసాగించారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో అభివృద్ది పరుగులు పెడుతోంది. దేశంలోనే ఏ ముఖ్యమంత్రీ చేయని పనులు చేస్తూ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలిచారు.
ఉద్యమ నేతగా తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ చేసిన పోరాటం, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కలిపి తాజాగా ఆయనపై ఓ ప్రత్యేక పాటను రూపొందించింది ఓ తెలుగు ఛానల్. సైదిరెడ్డి నిర్మాతగా వీరేంద్ర కాపరి రాసిన ఈ సాంగ్ ను జై శ్రీనివాస్ పాడగా.. ఏఆర్‌కే రాజు మ్యూజిక్ అందించారు. ఒక కంఠం కోటి గొంతుకల ఉద్యమ రణ… అంటూ సాగే ఈ పాట తెలంగాణ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటోంది.