బుధవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు అమోదం తెలిపారు. రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించే నూతన విధానానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. స్థానికులకు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించింది. దీంతో పాటు సెక్రటేరియట్ కొత్త భవన సముదాయం నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డిజైన్లను ఆమోదించింది.
నూతన పారిశ్రామిక విధాన లక్ష్యాల్లో పెట్టుబడుల ఆకర్షణకు ఉపాధి కల్పన నైపుణ్యాభివృద్ధిలో స్థానిక ప్రజలు సాధికారత సాధించడం, ఆర్థిక స్వావలంబనతో జీవన ప్రమాణాల్ని మెరుగుపర్చడం కూడా ముఖ్యమైంది. రాష్ట్రంలో నెలకొల్పబోయే పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను ప్రభుత్వ పారిశ్రామిక, విద్యాసంస్థల పరస్పర సహకారంతో అందించాలని కేబినెట్ అభిప్రాయపడింది.