నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ..

266
Telangana cabinet meeting today
- Advertisement -

రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఇవాళ సాయంత్రం 5 గంటలకు జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.  సమావేశంలో దళిత, గిరిజనుల ప్రత్యేక అభివృద్ధి నిధి బిల్లుపై చర్చించి, ఆమోదం తెలపనున్నారు. దళిత, గిరిజనుల సబ్ ప్లాన్ స్థానంలో ప్రత్యేక అభివృద్ధి నిధిని ఏర్పాటు చేయాలని, దానికి చట్టరూపం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో సబ్ ప్లాన్‌ చట్టంలో ఉన్న లోపాలను సవరించడంతోపాటు కొన్ని అంశాల్లో మార్పులు చేస్తోంది. ప్రధానంగా ఒక ఏడాది ఖర్చు కాని నిధులను తర్వాత సంవత్సరానికి బదలాయించడం, నిధుల సత్వర వినియోగం, జవాబుదారీతనంపెంపు తదితరఅంశాలను ఇందులో చేర్చనున్నట్లు తెలిసింది. కొత్త బిల్లు రూపకల్పన అనంతరం శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టనున్నారు.

మైనారిటీ, గిరిజన రిజర్వేషన్ల బిల్లు, సెంట్రల్‌ క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ (రిజిస్ట్రేషన్‌ అండ్‌ రెగ్యులేషన్‌)ను రాష్ట్రానికి అన్వయించుకునే బిల్లు, రాష్ట్ర మార్కెటింగ్‌ చట్టానికి సంబంధించిన బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. ముస్లిం, గిరిజన రిజర్వేషన్ల పెంపు బిల్లులను ఈ శాసనసభా సమావేశాల్లో ఆమోదిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. అయితే ముస్లిం రిజర్వేషన్ల పెంపునకు అవసరమైన బీసీ కమిషన్‌ నివేదిక అందజేతలో జాప్యం జరుగుతోంది. కమిషన్‌ క్షేత్రస్థాయి పర్యటనలు జరిపినా నివేదిక ఇంకా సిద్ధం చేయలేదని తెలిసింది.

గిరిజన రిజర్వేషన్ల పెంపుపైనా ప్రభుత్వానికి నివేదిక అందలేదు. ఈ నేపథ్యంలో ఈ సమావేశాల్లో బిల్లులను పెట్టేది అనుమానంగా మారింది. రిజర్వేషన్ల పెంపుదలపై కార్యాచరణ గురించి మంగళవారం మంత్రిమండలి భేటీలో చర్చిస్తారని తెలిసింది. ఈ సమావేశాల్లో సాధ్యం కాకపోతే శాసనసభ, మండలి ప్రత్యేక సమావేశాలను నిర్వహించి, బిల్లులను ఆమోదించే అవకాశం ఉంది.

- Advertisement -