Telangana BJP:బీజేపీ ‘బీసీ మంత్రం’!

22
- Advertisement -

రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. ఒకవైపు అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల రేస్ లో దూసుకుపోతుంటే కాషాయ పార్టీ మాత్రం ఇంకా తడబడుతూనే ఉంది. ఇప్పటివరకు అభ్యర్థులనే కన్ఫర్మ్ చేయని కాషాయ పార్టీ తదుపరి కార్యక్రమాల విషయంలో కూడా కన్ఫ్యూజన్ లో పడింది. నియోజిక వర్గాల వారీగా అభ్యర్థుల కొరత తీవ్రంగా వేధిస్తుండడంతో తొలి జాబితా ఆలస్యం అవుతూవస్తోంది. ఇంకా ప్రచార కార్యక్రమాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆ పార్టీ నేతలు గందరగోళానికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఎన్నికలు దగ్గర పడడంతో ఇలాగే నత్త నడకన సాగితే పార్టీకి తీవ్రంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నేతలు భావిస్తున్నారట..

అందుకే ప్రజలకు దగ్గరయ్యేందుకు కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు పార్టీ పెద్దలు. అందులో భాగంగానే బీసీ ఓటర్లే మెయిన్ టార్గెట్ గా ప్రణాళికలు రచిస్తున్నారట.రాష్ట్రంలో అధిక భాగం ఉన్న బీసీ ఓటర్లను తమ పార్టీ వైపు తిప్పుకుంటే తిరుగుండదనే అభిప్రాయంతో కాషాయ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది.అందుకే బీసీ ఎజెండాతోనే ముందుకు వెళ్లాలని బీజేపీ భావిస్తోందట. టికెట్ల కేటాయింపులో బీసీలకే అధిక సీట్లు కేటాయించడం తో పాటు బీసీ వర్గం నుంచే సి‌ఎం అభ్యర్థిని కూడా ఎన్నుకునే ఆలోచనలో ఉన్నారట.

ఇప్పటివరకు బీజేపీ నుంచి సి‌ఎం అభ్యర్థి రేస్ లో బండి సంజయ్, కిషన్ రెడ్డి వంటి వారి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి వీరిద్దరిలో ఎవరో ఒకరిని ఎన్నుకుంటారా ? లేదా కొత్త వారికి ఛాన్స్ ఇస్తారా అనేది చూడాలి. ఇక త్వరలో బీసీ గర్జన పేరుతో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారట బీజేపీ నేతలు. ఈ సభకు నరేంద్ర మోడీ లేదా అమిత్ షా వంటి వారిని ఆహ్వానించాలని భావిస్తున్నారట. మొత్తానికి ఎన్నికల ముందు పూర్తిగా డీలా పడ్డ కాషాయ పార్టీ బీసీ మంత్రం జపిస్తూ ముందుకు సాగాలని చూస్తోంది.

Also Read:BS Ravi:ప‌నిని పూజిస్తే దేవుడ్ని పూజించ‌టం కంటే గొప్ప‌

- Advertisement -