ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ‘దిమాగీ నక్సల్’ (మేధో నక్సల్స్) వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ తీవ్రంగా స్పందించారు. దేశంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించకుండా ఏటా కొత్త కొత్త పదాలను పరిచయం చేస్తూ ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని మోదీపై విమర్శలు గుప్పించారు.
ప్రధాని మోదీ ప్రతిసారీ కొత్త పదాలను తెరపైకి తీసుకొస్తున్నారని తేజస్వి యాదవ్ ఎద్దేవా చేశారు. గతంలో ‘అందోళనజీవులు’, ‘అర్బన్ నక్సల్స్’ వంటి పదాలను ఉపయోగించారని ఇప్పుడు ‘దిమాగీ నక్సల్స్’ అనే కొత్త పదాన్ని తీసుకొచ్చారని విమర్శించారు. ఇలాంటి పదాలను సృష్టించడంపై చూపిస్తున్న శ్రద్ధను దేశంలోని నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంపై ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు.
దేశంలో యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. యువతకు ఉద్యోగాలు కల్పించడం, ప్రజల సమస్యలను పరిష్కరించడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు.
Also Read:దమ్ముంటే రా..రేవంత్‌కి ఎర్రబెల్లి సవాల్!
ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో భద్రతా సిబ్బందితో దీపావళి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ ‘దిమాగీ నక్సల్స్’ అంశాన్ని ప్రస్తావించారు. సాయుధ నక్సలైట్లు అడవుల నుంచి కనుమరుగైనప్పటికీ వారి భావజాలాన్ని ప్రోత్సహించే వ్యక్తులు వివిధ సంస్థలు, రాజకీయ పార్టీల్లోకి చొరబడి రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. అలాంటి వారిని గుర్తించి ఓడించాలని పిలుపునిచ్చారు.

