బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అరెస్ట్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామిక, నిరంకుశ వైఖరికి ఈ అరెస్ట్ నిదర్శనమని విమర్శించారు. కోస్గిలో మృతి చెందిన పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్తున్న నరేందర్‌రెడ్డిని పరిగి బహార్‌పేట్ చౌరస్తా వద్ద పోలీసులు అరెస్ట్ చేయడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కష్టాల్లో ఉన్న పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న నాయకుడిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కేటీఆర్ ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి అండగా నిలవడం కూడా ఇందిరమ్మ రాజ్యంలో నేరమైందా? అని నిలదీశారు. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కుతోందని ఆరోపించారు.
అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురిచేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విధానంగా మారిందని కేటీఆర్ విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి కక్షసాధింపు చర్యలకు బీఆర్ఎస్ ఏమాత్రం భయపడబోదని స్పష్టం చేశారు.
Also Read:దమ్ముంటే రా..రేవంత్‌కి ఎర్రబెల్లి సవాల్!
ప్రజల పక్షాన, పార్టీ కార్యకర్తల పక్షాన తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. పట్నం నరేందర్‌రెడ్డిని వెంటనే ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

