‘ఉమ్మడి మేనిఫెస్టో’.. హైలెట్స్ ఏంటో ?

17
- Advertisement -

ఏపీలో అధికారమే లక్ష్యంగా టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు కూటమి గా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సీట్ల కేటాయింపు కూడా జరిగిపోయింది. పొత్తులో భాగంగా టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేయబోతున్నాయి. ఇప్పటికే మూడు పార్టీలు కలిసి ప్రచారాన్ని కూడా వేగవంతం చేస్తున్నాయి. ఇక త్వరలో ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేసేందుకు కూటమిలోని అగ్రనేతలు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాజాగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీట్ల కేటాయింపులో వచ్చిన అసమ్మతి, తదుపరి కార్యాచరణ వంటి విశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. మరి ముఖ్యంగా మేనిఫెస్టో పై కూడా చర్చ జరిగినట్లు సమాచారం.

ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో టీడీపీ మినీ మేనిఫెస్టో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆలాగే జనసేన షణ్ముఖ అస్త్రం పేరుతో కొన్ని హామీలను ప్రకటించింది. ఇప్పుడు బీజేపీ కూడా పొత్తులో ఉండడంతో ఆ పార్టీ సూచించిన హామీలను కూడా పరిగణలోకి తీసుకొని ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అటు వైసీపీ కూడా త్వరలో మేనిఫెస్టో ప్రకరించే అవకాశాలు కనిపిస్తుండడంతో ఆ పార్టీ కంటే ముందే మేనిఫెస్టో ప్రకటించి ప్రజల్లోకి వెళ్ళేలా చంద్రబాబు పవన్ ప్లాన్ చేస్తునట్లు తెలుస్తోంది.

అయితే టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగ భృతి, కుటుంబం లోని ప్రతి మహిళకు రూ.1500, తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి రూ.15000, ఏడాది కి మూడు ఉచిత గ్యాసు సిలిండర్లు.. ఇలా తదితర హామీలను ప్రకటించారు. ఇక పొత్తులో భాగంగా త్వరలో ప్రకటించే ఉమ్మడి మేనిఫెస్టోలో ఈ హామీలను అలాగే కొనసాగిస్తారా ? లేదా ఏమైనా మార్పు చేస్తారా ? అనే ప్రశ్నలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనప్పటికి టీడీపీ జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో వీలైనంత త్వరగా ప్రజల్లోకి తీసుకురావాలని అధినాయకులు ప్రయత్నిస్తునట్లు తెలుస్తోంది. మరి ఉమ్మడి మేనిఫెస్టో ఎలా ఉండబోతుందో చూడాలి.

Also Read:BJP: 9 మందితో బీజేపీ మూడో జాబితా

- Advertisement -