తమిళంలో తారామణి పేరుతో విడుదలై ఘనవిజయం సాధించిన చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర టీజర్స్ కి అద్భుతమైన స్పందన లభించింది. తమిళంలో రూపొందిన రియల్ స్టోరీ ట్రెండ్ ని సెట్ చేసింది. అలాంటి తారామణి చిత్రం ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. అంజలి, ఆండ్రియా, వసంత్ రవి ప్రధాన పాత్రల్లో రామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఈ చిత్రాన్ని తెలుగులో జె.ఎస్.కె. ఫిలిం కార్పొరేషన్ సమర్పణలో డి.వి. సినీ క్రియేషన్స్ పతాకంపై డి.వెంకటేష్ అందిస్తున్నారు. గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ సినిమాను తెలుగులో విడుదల చేస్తుంది. ఈ సందర్భంగా ….
నిర్మాత మల్టీడైమన్షన్ వాసు మాట్లాడుతూ – తమిళంలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్స్ ఈ సినిమాను పబ్లిసిటీ చేశారు. తెలుగులో కూడా సినిమా పెద్ద సక్సెస్ కావాలని నిర్మాత వెంకటేశ్‌కు, గుడ్ సినిమా శ్రీనివాస్‌కి మంచి పేరు, డబ్బులు తేవాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
రచయిత డార్లింగ్ స్వామి మాట్లాడుతూ – “తమిళంలో సినిమా చూడగానే బాగా నచ్చింది. ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తే బావుంటుందని అనుకున్నాను. నేను అనుకున్నట్లుగానే డి.వెంకటేశ్ సినిమాను తెలుగులో విడుదల చేస్తుండటం ఆనందంగా ఉంది. సినిమా తప్పకుండా పెద్ద హిట్ సాధిస్తుంది“ అన్నారు.
చిత్ర నిర్మాత డి.వెంకటేశ్ మాట్లాడుతూ – “తమిళంలో విడుదలైన ఈ సినిమా వివేకం, విఐపి 2 సినిమాలతో పాటు పెద్ద సక్సెస్‌ను సాధించింది. ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న సమస్యను ఎంటర్‌టైన్‌మెంట్ వేలో అందిస్తూ రూపొందిన చిత్రమిది. కుటుంబ సభ్యులతో కలిసి చూసే సినిమా ఇది. తప్పకుండా సక్సెస్ అవుతుంది“ అన్నారు.
నిర్మాత కె.అచ్చిరెడ్డి మాట్లాడుతూ – “తారామణి సినిమా ట్రైలర్ చూడగానే అర్జున్ రెడ్డి సినిమాలోని సిన్సియర్ మేకింగ్ కనపడింది. అర్జున్ రెడ్డి స్థాయి కమర్షియల్ సక్సెస్‌ను ఈ సినిమా కూడా సాధిస్తుందని నమ్ముతున్నాను. డి.వెంకటేశ్‌తో కలిసి మారుతి, శ్రీనివాస్ తెలుగులో సినిమాను విడుదల చేస్తున్నారు. తప్పకుండా సినిమా పెద్ద హిట్ సాధిస్తుందనడంలో సందేహం లేదు“ అన్నారు.
దర్శకుడు మారుతి మాట్లాడుతూ – “చెన్నైలోని రైల్వేస్టేషన్ ఏరియా పేరే `తారామణి`. అందుకే తెలుగులోనూ ఈ చిత్రానికి తారామణి అనే పేరు పెట్టారు. తెలుగుకు కూడా ఈ పేరు బాగా సెట్ అయ్యింది. ఈ సినిమా రీసెంట్‌గా చూశాను. చూడగానే ఈరోజుల్లో స్టైల్లో అంటే ట్రెండ్‌కి మ్యాచ్ అయ్యే విధంగా ఉన్నట్లు అనిపించింది. సెన్సిబుల్‌గా, వల్గారిటీ లేకుండా, లిమిట్స్‌ను క్రాస్ చేయకుండా చేసిన సినిమా ఇది. నాకు నచ్చడంతో నేను, శ్రీనివాస్ కలిసి తెలుగులో త్వరలోనే రిలీజ్ చేస్తున్నాం“ అని అన్నారు.