నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఓ శక్తి వంతమైన రాష్ట్రంగా రూపుదిద్దుకుంటుందన్నారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయజెండాను ఎగురవేసిన అనంతరం మాట్లాడిన ఆమె…..కొత్త పథకాలతో, కొత్త చొరవతో, కొత్త ఆవిష్కరణలతో కొత్త రాష్ట్రమైన తెలంగాణ సరికొత్త రికార్డులను నెలకొల్పుతుందన్నారు.
కోవిడ్ వల్ల ఆర్థిక ఇబ్బందులు వచ్చినా పథకాలు ఎక్కడ ఆగలేదని…. అవినీతి రహిత, పారదర్శక పాలన అందించేందుకి పాలన పరమైన సంస్కరణలు ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఆకలి దప్పులు లేని, ఆత్మహత్యలు లేని, సుఖ సంతోషాలతో, సిరిసంపదలతో కూడిన బంగారు తెలంగాణ నిర్మాణానికి బలమైన పునాదులు పడ్డాయని వెల్లడించారు.
హైదరాబాద్ నగరంలో నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ త్వరలోనే ప్రారంభం కానుందన్నారు. శాంతి భద్రతల పర్యవేక్షణ, వివిధ పోలీస్ స్టేషన్ల మధ్య సమన్వయం కోసం ప్రభుత్వం పోలీసు శాఖను పునర్వ్యవస్థీకరించిందని తెలిపారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి బలమైన పునాదులు పడ్డాయని….. ప్రజలందరి భాగస్వామ్యంతో ఈ ప్రగతి యజ్ఞాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి ప్రభుత్వం గట్టి పట్టుదలతో పనిచేస్తుందని వెల్లడించారు.