పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మళ్లీ పీక్ స్టేజీకి చేరాయి. ఆఫ్ఘనిస్థాన్‌లోని తూర్పు ప్రావిన్సులైన కునార్, పక్తికా ప్రాంతాల్లో పాకిస్థాన్ దళాలు జరిపిన వైమానిక దాడులు (Airstrikes) ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. తమ దేశంలో సరిహద్దు భద్రతా దళాలపై జరిగిన దాడులకు నిరసనగా, ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు ఇస్లామాబాద్ ప్రకటించింది.
ఈ దాడులపై ఆఫ్ఘనిస్థాన్‌ను పాలిస్తున్న తాలిబన్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్థాన్ చర్యలు తమ దేశ సార్వభౌమాధికారాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మండిపడ్డారు. ఈ సైనిక చర్యల్లో నిరపరాధులైన పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపిస్తూ, పాకిస్థాన్ ఆక్రమణకు తగిన సమయంలో బలమైన రీతిలో సమాధానం ఇస్తామని తీవ్రంగా హెచ్చరించారు.
ఈ దాడి పరిణామాలపై రష్యా విదేశాంగ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రెండు ఆసియా దేశాల మధ్య సైనిక ఘర్షణలు పెరగడం ప్రాంతీయ స్థిరత్వానికి తీవ్ర విఘాతం కలిగిస్తుందని వ్యాఖ్యానించింది. ఇరు దేశాలు సహనంతో వ్యవహరించాలని, ముఖాముఖి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని రష్యా పిలుపునిచ్చింది.
తాలిబన్లు మళ్లీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆఫ్ఘన్ భూభాగం వేదికగా ‘తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్’ (TTP) దాడులకు తెగబడుతోందని పాక్ ఆరోపిస్తుండగా, తాలిబన్లు వాటిని ఖండిస్తున్నారు. ఈ పరస్పర దాడులతో సరిహద్దు ప్రాంతాల్లో మళ్లీ యుద్ధ మేఘాలు అలుముకున్నాయి.
Also Read:జార్జ్ క్రిష్ ..’ఫస్ట్ బూస్టర్’ అదుర్స్!

