ITAT ఖాళీలపై సుప్రీం ఆశ్చర్యం!

3
- Advertisement -

ఇన్‌కమ్ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ITAT) పరిపాలనా విభాగంలో దశాబ్ద కాలంగా భారీ సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉండటంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ట్రిబ్యునల్ పనితీరును దెబ్బతీస్తున్న ఈ దీర్ఘకాలిక ఖాళీలను వీలైనంత త్వరగా భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని భారత అటార్నీ జనరల్‌ను కోరింది. దేశవ్యాప్తంగా ఉన్న ఐటీఏటీ బెంచ్‌లలో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కొరత వల్ల ఎదురవుతున్న ఇబ్బందులపై దాఖలైన రిట్ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం మంగళవారం విచారించింది.

భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ప్రవీణ్ కుమార్ బన్సల్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టుకు కీలక వివరాలు సమర్పించారు. దేశవ్యాప్తంగా ఉన్న 30 ఐటీఏటీ బెంచ్‌లలో అత్యంత కీలకమైన పరిపాలనా పోస్టులు కొన్నేళ్లుగా భర్తీకి నోచుకోకుండా ఖాళీగా దర్శనమిస్తున్నాయని వివరించారు. ఉన్నతాధికారుల స్థాయి నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అన్ని విభాగాల్లోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు.

ట్రిబ్యునల్‌లో అసిస్టెంట్ రిజిస్ట్రార్లు, పీఎస్‌సీ పోస్టులతో పాటు దాదాపు అన్ని రకాల కీలకమైన ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని రోహత్గీ ధర్మాసనానికి తెలియజేశారు. ఈ సమస్య కేవలం ప్రధాన బెంచ్‌కే పరిమితమా లేదా ప్రాంతీయ బెంచ్‌లలోనూ ఉందా అని ధర్మాసనం ప్రశ్నించగా అన్ని చోట్లా ఇదే దుస్థితి నెలకొందని ఆయన స్పష్టం చేశారు. గత పదేళ్లుగా ఈ పోస్టులు ఖాళీగా ఉంటే అసలు ఈ వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

ట్రిబ్యునల్ పరిపాలనా విభాగం స్తంభించిపోయేలా ఉన్న ఈ ఉదంతంపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ ఇన్నాళ్లుగా ఈ పోస్టులను ఎందుకు భర్తీ చేయలేదనే అంశం తమకు ఆశ్చర్యం కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ తీవ్రమైన సమస్యను పరిష్కరించడానికి తాము ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ వ్యవహారంలో భారత అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి స్వయంగా జోక్యం చేసుకుని పరిశీలించాలని కోర్టు పేర్కొంది. ఐటీఏటీ బెంచ్‌ల సక్రమ నిర్వహణ కోసం అవసరమైన జ్యుడీషియల్ అధికారులను అందుబాటులో ఉంచాల్సిందిగా ఆయా రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను కూడా సుప్రీంకోర్టు కోరింది.

Also Read:టెక్నాలజీ యుగంలో జాప్యమా?

- Advertisement -