బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రస్తుతం తీవ్ర వివాదాల నడుమ చిక్కుకున్నారు. ఒకవైపు ఆయనపై పశ్చిమ భారత చలనచిత్ర ఉద్యోగుల సమాఖ్య (FWICE) నిషేధం విధించగా మరోవైపు కర్ణాటక హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన మైసూర్‌లోని ప్రసిద్ధ చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తులైన తెల్లటి కుర్తా పైజామా నల్లటి వెయిస్ట్‌కోట్ ధరించి ముఖానికి మాస్క్ పెట్టుకుని అత్యంత సాధారణ భక్తుడిలా ఆయన ఆలయానికి విచ్చేశారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రణ్‌వీర్ సింగ్ అక్కడ దాదాపు పది నిమిషాల పాటు గడిపారు. ఆలయ సిబ్బంది ఆయనను గుర్తించి పూలమాలతో స్వాగతం పలికారు. ఈ పర్యటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
రణ్‌వీర్ సింగ్ చాముండేశ్వరి ఆలయాన్ని దర్శించుకోవడం వివాదం ఉంది. గోవాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (IFFI 2025) ముగింపు వేడుకల్లో కన్నడ హిట్ చిత్రం ‘కాంతార’లోని దైవ నర్తన ప్రక్రియను రణ్‌వీర్ అనుకరించడం వివాదాస్పదమైంది. తీరప్రాంత కర్ణాటక ప్రజల ఆరాధ్య దైవమైన చాముండి దైవాన్ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ధైవ నిందగా భావిస్తూ కొందరు లాయర్లు కర్ణాటకలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ కేసు విచారణ సందర్భంగా రణ్‌వీర్ సింగ్ తరఫు న్యాయవాది హైకోర్టులో బేషరతు క్షమాపణలు తెలియజేస్తూ అఫిడవిట్ సమర్పించారు. దీనిని పరిశీలించిన కర్ణాటక హైకోర్టు నాలుగు వారాల్లోగా మైసూర్ చాముండేశ్వరి అమ్మవారి ఆలయానికి స్వయంగా వెళ్లి క్షమాపణలు చెప్పాలని ఆదేశిస్తూ కేసును ముగించింది. కోర్టు విధించిన గడువు ముగియనుండటంతో ఆయన ఈ పర్యటనను పూర్తి చేశారు.
ఈ ఆధ్యాత్మిక పర్యటన ఒకవైపు సాగుతుండగానే ముంబై సినీ పరిశ్రమలో ఆయన కెరీర్‌కు సంబంధించి మరో పెద్ద షాక్ తగిలింది. ప్రముఖ దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘డాన్ 3’ నుంచి రణ్‌వీర్ సింగ్ అకస్మాత్తుగా తప్పుకోవడం తీవ్ర దుమారానికి దారితీసింది. సినిమా షూటింగ్ ప్రారంభానికి కేవలం మూడు వారాల ముందు ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రొడక్షన్ హౌస్ ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లిందని ఫర్హాన్ అఖ్తర్ ఫిల్మ్ బాడీకి ఫిర్యాదు చేశారు. ప్రిప్రొడక్షన్ ఖర్చుల కింద రూ.45 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని నిర్మాతలు డిమాండ్ చేస్తున్నారు.
Also Read:టెక్నాలజీ యుగంలో జాప్యమా?

