కర్ణాటకలో సీఎం మార్పు ఊహాగానాలు మరోసారి జోరందుకున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇద్దరూ అధిష్ఠానం పిలుపు మేరకు అత్యవసరంగా ఢిల్లీకి చేరుకోవడంతో నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. ఈ భేటీని కేవలం సాధారణ సమన్వయ సమావేశంగానే పార్టీ వర్గాలు అభివర్ణిస్తున్నప్పటికీ రాష్ట్రంలో అధికార బదిలీ కి హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పీఠం నుంచి దించి కేంద్ర రాజకీయాల్లోకి తీసుకురావడానికి కాంగ్రెస్ పెద్దలు ఒక వ్యూహాత్మక ప్లాన్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. అధిష్ఠానం యోచిస్తున్న ఈ కొత్త ఫార్ములా ప్రకారం సిద్ధరామయ్యను కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకునేలా ఒప్పించి ఆయనకు రాజ్యసభ సీటును ఆఫర్ చేయనున్నారు. దీంతో పాటు ఆయన కుమారుడు యతీంద్రకు రాష్ట్ర క్యాబినెట్‌లో మంత్రి పదవి ఇచ్చేలా ఒక ఒప్పందాన్ని కుదిర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవలే బీహార్ రాజకీయాల్లో నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవిని వీడి రాజ్యసభకు వెళ్లడం ఆయన కుమారుడు నిశాంత్ కుమార్‌కు మంత్రి పదవి దక్కడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఇప్పుడు కర్ణాటకలోనూ సరిగ్గా అదే తరహా ‘బీహార్ వ్యూహాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ అగ్రనాయకత్వం భావిస్తోంది.అయితే ఈ ప్లాన్ ప్రకారం సిద్ధరామయ్య ఒకవేళ రాజ్యసభకు వెళ్లేందుకు అంగీకరించినప్పటికీ ఆయన స్థానంలో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావడం అంత సులువుగా కనిపించడం లేదు. తన తర్వాత డీకే శివకుమార్ సీఎం పీఠాన్ని అధిరోహించడం సిద్ధరామయ్యకు ఎంతమాత్రం ఇష్టం లేదని సమాచారం. ఒకవేళ ఇరు వర్గాల మధ్య తీవ్రమైన విభేదాలు తలెత్తితే ఒక సయోధ్య అభ్యర్థిగా మరోకరిని సీఎంగా నియమిస్తారని ప్రచారం జరుగుతోంది.
Also Read:టెక్నాలజీ యుగంలో జాప్యమా?
2028 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించాలంటే ఇప్పుడే లీడర్‌షిప్ మార్చాలని వారు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీకి చేరుకున్న డీకే శివకుమార్‌ను మీడియా ప్రతినిధులు మీరు తదుపరి ముఖ్యమంత్రి అవుతున్నారా అని ప్రశ్నించగా ఆయన ఎలాంటి సమాధానం చెప్పకుండా కేవలం చిరునవ్వు చిందిస్తూ తన కారులో వెళ్ళిపోయారు.

