బాణసంచా అక్రమ విక్రయాలపై సుప్రీం ఆగ్రహం

3
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నప్పటికీ సంప్రదాయ, అనధికార బాణసంచా బహిరంగంగా విక్రయిస్తున్నారంటూ వచ్చిన వార్తా కథనాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం, పోలీసు అధికారులు తక్షణమే దృష్టి సారించి నిబంధనల ఉల్లంఘనలను అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ ప్రసన్న బి. వరాలేలతో కూడిన ధర్మాసనం మంగళవారం ప్రస్తావించింది. కోర్టు ఆంక్షలు విధించినప్పటికీ ఢిల్లీలోని పలు మార్కెట్లలో బాణసంచా బహిరంగంగా ప్రదర్శిస్తూ విక్రయిస్తున్నారని ఆ కథనంలో వెల్లడైంది. సాధారణ టపాసులను అడిగిన వారికి రహస్యంగా అందిస్తున్నారని, సరైన ధ్రువీకరణ లేని క్యూఆర్ కోడ్లతో కొన్ని ఉత్పత్తులను గ్రీన్ క్రాకర్స్‌గా విక్రయిస్తున్నారని పేర్కొంది.

ఈ విషయాన్ని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం, వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (సీఏక్యూఎం) తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటికి ధర్మాసనం తెలియజేసింది. కోర్టు ఆదేశాలు వెలువడిన మరుసటి రోజే దుకాణాల్లో అన్ని రకాల బాణసంచా అందుబాటులో ఉందని వార్తా కథనంలో ఫొటోలతో సహా వివరించారని పేర్కొంది. లైసెన్స్ ఉన్నవి, లేనివి, క్యూఆర్ కోడ్ ఉన్నవి, లేనివి.. ఇలా అన్ని రకాల టపాసులు మార్కెట్లో విక్రయిస్తున్నారన్న సమాచారాన్ని పరిశీలించాలని సూచించింది.

కొన్ని బాణసంచా పెట్టెలపై కోర్టు తప్పనిసరి చేసిన క్యూఆర్ కోడ్లు లేవని, మరికొన్ని కోడ్లు ఉత్పత్తి ధ్రువీకరణ వివరాలకు బదులుగా ఆన్‌లైన్ కేటలాగ్‌లకు దారి తీస్తున్నాయని పేర్కొంది. కొందరు వ్యాపారులు సాధారణ టపాసులను బయటకు కనిపించకుండా ఉంచి, వినియోగదారులు అడిగినప్పుడు తీసుకొస్తున్నారని వివరించింది. ఆన్‌లైన్ విక్రయాలపై నిషేధం ఉన్నప్పటికీ ఇంటికి డెలివరీ చేసేందుకు ముందస్తు ఆర్డర్లు తీసుకుంటున్నట్లు కూడా గుర్తించారు.

Also Read:మంత్రి శ్రీధర్ బాబు vs ఎంపీ వంశీకృష్ణ

దీపావళి నేపథ్యంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో ధ్రువీకరించిన గ్రీన్ క్రాకర్స్ విక్రయాలకు నవంబర్ 4 నుంచి 6 వరకు సుప్రీంకోర్టు సోమవారం అనుమతించింది. అయితే బాణసంచా కాల్చేందుకు నవంబర్ 7, 8 తేదీల్లో మాత్రమే నిర్దిష్ట సమయాలను కేటాయించింది. ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే కాల్చాలని స్పష్టం చేసింది. నవంబర్ 9 నుంచి మళ్లీ పూర్తి నిషేధం అమల్లోకి రానుంది.

- Advertisement -