భారతదేశంలో రిజర్వేషన్ల ప్రయోజనాలు తరం తర్వాత తరం నిరంతరం కొనసాగాలా? ఒకసారి రిజర్వేషన్ల ద్వారా సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకున్న కుటుంబాలకు కూడా ఈ ప్రయోజనాలు అందాలా? అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఒకే కుటుంబంలో తరతరాలుగా కోటా ప్రయోజనాలు పొందడంపై న్యాయస్థానం తన ఆందోళనను వ్యక్తం చేసింది.
జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం.. సామాజికంగా, వృత్తిపరంగా స్థిరపడి, ఆర్థిక భద్రత కలిగిన తల్లిదండ్రుల పిల్లలు ఇతర వెనుకబడిన తరగతుల (OBC) కేటగిరీ కింద రిజర్వేషన్ ప్రయోజనాలను ఎలా క్లెయిమ్ చేస్తారని పదే పదే ప్రశ్నించింది.
తల్లిదండ్రులు ఇద్దరూ ఐఏఎస్ (IAS) అధికారులు అయితే వారి పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు ఉండాలి? విద్య, ఆర్థిక సాధికారతతో సమాజంలో ఉన్నత మార్పు (Social Mobility) వస్తుంది అని విచారణ సందర్భంగా జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు. అలాంటి వారి పిల్లలకు కూడా మళ్లీ రిజర్వేషన్లు కోరితే, మనం ఈ రిజర్వేషన్ల వ్యవస్థ నుండి ఎప్పటికీ బయటపడలేము. ఇది మనం ఖచ్చితంగా ఆందోళన చెందాల్సిన విషయం. ఒకసారి తల్లిదండ్రులు బాగా చదువుకుని, మంచి ఉద్యోగాల్లో ఉంటూ, మంచి ఆదాయం పొందుతున్నప్పుడు.. వారి పిల్లలు మళ్లీ రిజర్వేషన్లు ఆశించడం ఏంటి? వారు రిజర్వేషన్ల పరిధి నుండి బయటకు రావాలి” అని ధర్మాసనం పేర్కొంది.
కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించే సమయంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఒక అభ్యర్థి ‘క్రీమీ లేయర్’ (Creamy Layer – వెనుకబడిన తరగతుల్లోని ధనిక వర్గం) పరిధిలోకి వస్తారనే కారణంతో అతనికి రిజర్వేషన్ ప్రయోజనాలను నిరాకరించడాన్ని కర్ణాటక హైకోర్టు సమర్థించింది.
కర్ణాటకలోని వెనుకబడిన తరగతుల కేటగిరీ II(A) కిందకు వచ్చే కురుబ సామాజిక వర్గానికి చెందిన ఒక అభ్యర్థి.. కర్ణాటక పవర్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టుకు రిజర్వేషన్ కేటగిరీ కింద ఎంపికయ్యారు. అయితే, ఆ అభ్యర్థి కుటుంబ వార్షిక ఆదాయం దాదాపు ₹19.48 లక్షలుగా ఉందని, తల్లిదండ్రులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులని, వారి సంయుక్త ఆదాయం నిర్ణీత పరిమితి కంటే ఎక్కువగా ఉందని తేలింది. దీంతో జిల్లా కుల మరియు ఆదాయ ధృవీకరణ కమిటీ అతనికి కుల ధృవీకరణ పత్రాన్ని నిరాకరించింది.
రిజర్వేషన్లు అనేవి సామాజిక ఎదుగుదలకు ఒక సాధనమని ధర్మాసనం నొక్కి చెప్పింది. ఇందులో కొంత సమతుల్యత (Balance) ఉండాలి. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు అవసరమే. కానీ, ఒకసారి రిజర్వేషన్ల ప్రయోజనం పొంది తల్లిదండ్రులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడి, ఉన్నత స్థితికి చేరుకున్నాక కూడా.. క్రీమీ లేయర్ మినహాయింపును ప్రశ్నించడం సరికాదు అని కోర్టు అభిప్రాయపడింది.
Also Read:Keralam:సెక్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టు

