₹2,000 కంటే ఎక్కువ విలువైన డిజిటల్ కొనుగోలు (Person-to-Merchant) యుపిఐ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్టే చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే, ఈ విషయమై వివరణ ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం సహా నాలుగు కీలక సంస్థలకు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
చీఫ్ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశిస్తూ నోటీసులు పంపింది:
కేంద్ర ప్రభుత్వం (యునియన్ ఆఫ్ ఇండియా)
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)
యుపిఐ స్టీరింగ్ కమిటీ
అడ్వకేట్ అంజన్ దత్తా దాఖలు చేసిన ప్రజాప్రయోజన పిటిషన్ (PIL) ఆధారంగా సుప్రీంకోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 14న ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్, సెప్టెంబర్ 15న ప్రకటించిన ఎండీఆర్ (MDR) నిబంధనలను ఈ పిటిషన్‌లో సవాలు చేశారు. ఎటువంటి చట్టబద్ధమైన ప్రక్రియ, పారదర్శకత లేదా ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా కేవలం పత్రికా ప్రకటనలు (Press Release) లేదా గైడ్‌లైన్స్ ఆధారంగా ఎండీఆర్ రుసుము వసూలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ పేర్కొన్నారు.
రూపే (RuPay) డెబిట్ కార్డ్ చెల్లింపులపై ఎటువంటి గరిష్ట పరిమితి లేకుండా పూర్తిగా ఉచిత సౌకర్యం కొనసాగిస్తూ.. యుపిఐపై మాత్రం రుసుములు విధించడం సరికాదని ప్రశ్నించారు. ఇది చట్టపరమైన అంశం కంటే సాంకేతిక పరమైన (Technical) అంశం అని వ్యాఖ్యానించింది. అలాగే ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్. వెంకటరామన్ కోర్టుకు వివరిస్తూ, యుపిఐ వాడుతున్న వారిలో 96 శాతం మంది వినియోగదారులకు ఈ రుసుము వర్తించదని, కేవలం పెద్ద పరిమాణంలో జరిగే వాణిజ్య లావాదేవీలపైనే ఇది వర్తిస్తుందని తెలిపారు.
గత ఆరేళ్లుగా పూర్తిగా ఉచితంగా ఉన్న యుపిఐ చెల్లింపుల విధానంలో ప్రభుత్వం మార్పులు తెచ్చింది. వ్యాపారులకు చేసే ₹2,000 పైబడిన కొనుగోలు లావాదేవీలపై 0.4 శాతం రుసుము వర్తిస్తుంది.
గరిష్ట పరిమితి (Cap): ₹75,000 మరియు అంతకంటే ఎక్కువ లావాదేవీలకు ఎండీఆర్ రుసుము గరిష్టంగా ₹300 దాటదు.
Also Read:పొంగులేటిపై ఈడీకి బీఆర్ఎస్ ఫిర్యాదు
నిత్యావసర రంగాలు: ఇంధనం (ఫ్యూయల్), రైల్వే, టెలికాం, ఇన్సూరెన్స్, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుపై ₹2,000 దాటితే కేవలం ప్లాట్ ₹5 రుసుము మాత్రమే ఉంటుంది.
స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్: మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్ డిపాజిట్లకు 0.02 శాతం రుసుము (గరిష్ట పరిమితి ₹300) వర్తిస్తుంది.
పూర్తిగా ఉచితం (P2P): ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి పంపే సాధారణ యుపిఐ బదిలీలు (P2P Transfers – ఇవి మొత్తం యుపిఐ వాల్యూమ్‌లో 37%, విలువలో 70% ఉంటాయి) మరియు ₹2,000 లోపు చిన్న వ్యాపార చెల్లింపులు ఎలాంటి ఛార్జీలు లేకుండా ఎప్పటికీ ఉచితంగానే కొనసాగుతాయి.

