స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. అక్టోబర్ 25 వరకు అభ్యర్థుల తుది జాబితా ప్రకటనను వాయిదా వేయాలని ఆదేశించింది. నామినేషన్లు దాఖలు చేయలేకపోయిన ప్రాంతాల్లో పరిస్థితులను పరిశీలించి, నామినేషన్ల గడువు పొడిగించాలా? వద్దా? అనే అంశంపై అక్టోబర్ 22లోగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
నామినేషన్లు దాఖలు చేయడానికి అభ్యర్థులు ఎదుర్కొన్న ఇబ్బందులపై సమగ్రంగా విచారణ జరపాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందుకోసం వీడియోలతో పాటు భౌతిక, ఎలక్ట్రానిక్ ఆధారాలను పరిశీలించాలని సూచించింది. నామినేషన్ల గడువు పొడిగించాలని నిర్ణయించే ప్రాంతాల్లో అభ్యర్థులకు కనీసం 48 గంటల సమయం కల్పించాలని పేర్కొంది. తద్వారా అర్హులైన అభ్యర్థులకు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కల్పించాలని స్పష్టం చేసింది.
నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చే అభ్యర్థులకు తగిన పోలీసు రక్షణ కల్పించాలని రాష్ట్ర డీజీపీని సుప్రీంకోర్టు ఆదేశించింది. నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఉంచాలని సూచించింది. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
Also Read:జైలర్ 2@రూ.541 కోట్లు
స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలు చేసిన వివరాలతో నివేదికలు సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం, డీజీపీని ఆదేశించింది.ఈ వ్యవహారంపై తదుపరి విచారణను అక్టోబర్ 26కు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో నామినేషన్ల గడువు పొడిగింపుపై రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయం, ఎన్నికల ప్రక్రియపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.

