ఢిల్లీ కాలుష్యంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

2
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కాలుష్య నియంత్రణ చర్యలు అమలవుతున్నప్పటికీ పరిస్థితిలో ఆశించిన మార్పు కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా ఢిల్లీ వాతావరణంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యంగ్యంగా స్పందించారు. “ఢిల్లీలోని వాతావరణాన్ని మీరు ఆస్వాదిస్తున్నారని ఆశిస్తున్నాను” అంటూ విచారణ ప్రారంభంలోనే వ్యాఖ్యానించారు.

దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)లో వాయు కాలుష్యంపై దాఖలైన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కోర్టుకు సహకరిస్తున్న అమికస్ క్యూరీ, సీనియర్ న్యాయవాది అపరాజిత సింగ్ కీలక విషయాలను ప్రస్తావించారు.

ఢిల్లీలో గాలి నాణ్యత ఇంకా తీవ్ర స్థాయిలోనే కొనసాగుతోందని, కాలుష్యం కారణంగా తన గొంతుపై కూడా ప్రభావం పడుతోందని ఆమె తెలిపారు. ఢిల్లీ గాలిని పీల్చడం అంటే రోజుకు 30 సిగరెట్లు తాగడంతో సమానమని పేర్కొన్నారు.

గతంలో వర్షాలు కురిసినప్పుడు కాలుష్య స్థాయులు తగ్గాయని సుప్రీంకోర్టు గుర్తుచేసింది. రైతులు తదుపరి పంట సాగుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పంట వ్యర్థాలను తగులబెట్టడం ఆగిపోయి ఉంటుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. అయితే ఢిల్లీలో కాలుష్యానికి పంట వ్యర్థాల దహనం 14 శాతం కారణమవుతోందని అపరాజిత సింగ్ వెల్లడించారు. పంట వ్యర్థాల దహనంతో పాటు చెత్తను కాల్చడం వంటి స్థానిక కాలుష్య కారకాలపై కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా పంట వ్యర్థాల కొనుగోలు ధరను ముందుగానే ప్రకటించాలని, వాటి నిర్వహణ బాధ్యతలను గ్రామ పంచాయతీలకు అప్పగించాలని సుప్రీంకోర్టు సూచించింది. రైతులకు పంట వ్యర్థాల నిర్వహణకు అవసరమైన వ్యవస్థను అందుబాటులో ఉంచాలని పేర్కొంది.

Also Read: గ్రీన్ క్రాకర్స్ పూర్తిగా కాలుష్య రహితమా?

మరోవైపు ఢిల్లీ కాలుష్యానికి పంట వ్యర్థాల దహనం మాత్రమే కారణమా? సంపన్న వర్గాల వ్యక్తిగత వాహనాల వల్ల కూడా కాలుష్యం పెరుగుతోందా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యానికి రవాణా రంగమే ప్రధాన కారణమని అపరాజిత సింగ్ తెలిపారు. రోడ్లపై వాహనాలు బంపర్ టు బంపర్ ప్రయాణించడం, ట్రాఫిక్‌లో ఇంజిన్లు ఆన్‌లోనే ఉంచడం కూడా కాలుష్యాన్ని పెంచుతున్నాయని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు.

- Advertisement -