బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ తన సినీ ప్రయాణంలో ఎదురైన ఆసక్తికర సంఘటనలను గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ సూపర్స్టార్లు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్‌లతో కలిసి పనిచేసిన అనుభవాలను పంచుకున్నారు. సినిమా సెట్స్‌లో ఎంత పెద్ద స్టార్ అయినా అందరినీ ఒకేలా చూసేవారినని అయితే అమితాబ్ బచ్చన్‌ను మాత్రం ఎప్పుడూ తిట్టే ధైర్యం చేయలేదని వెల్లడించారు.
నేహా ధూపియా, అంగద్ బేడీ నిర్వహిస్తున్న ‘డబుల్ డేట్’ టాక్ షోలో టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో కలిసి పాల్గొన్న ఫరా ఖాన్ ఈ విషయాలను వెల్లడించారు. కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కభీ ఖుషీ కభీ గమ్’ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనలను గుర్తుచేసుకున్నారు.
ఆ సినిమా షూటింగ్ సమయంలో షారుఖ్ ఖాన్ తన దగ్గరకు వచ్చి ఒక విషయం చెప్పారని ఫరా తెలిపారు. “షారుఖ్ చాలా మంచివాడు. నేను ఏదైనా తప్పు చేస్తే అందరి ముందు తనపై గట్టిగా అరిచేందుకు వెనుకాడవద్దని చెప్పాడు. నువ్వు షారుఖ్ ఖాన్పైనే అరిస్తే, ఇక అందరికీ నువ్వు ఎవరినీ వదిలిపెట్టవనే విషయం అర్థమవుతుందని అన్నాడు” అని ఫరా గుర్తుచేసుకున్నారు.
ఈ సందర్భంగా ‘సే శావా శావా’ పాట షూటింగ్లో జరిగిన మరో సంఘటనను వివరించారు. ఆ పాటకు అమితాబ్ బచ్చన్ డ్యాన్స్ స్టెప్పులు వేస్తుండగా, ఆయన కొన్ని స్టెప్పులను మార్చేవారట. అదే సమయంలో వెనుక నిలబడి ఉన్న షారుఖ్ ఖాన్ ఏదో చెబుతున్నట్లు కనిపించడంతో ఫరా వెంటనే ఆయన వైపు తిరిగి, “షారుఖ్.. స్టెప్ మార్చడానికి నీకెంత ధైర్యం? నేను నేర్పించినట్లే చేయాలి” అంటూ గట్టిగా అరిచారట.
Also Read:గ్రీన్ క్రాకర్స్ పూర్తిగా కాలుష్య రహితమా?
షారుఖ్ ఖాన్ కూడా తన సమానత్వ వైఖరిని సరదాగా ప్రశంసించేవారని ఫరా తెలిపారు. స్పాట్ బాయ్ అయినా, తనలాంటి సూపర్ స్టార్ అయినా అందరినీ ఒకేలా చూస్తావని, అందరిపైనా సమానంగా అరిచేస్తావని సరదాగా అనేవాడని చెప్పారు. అయితే షారుఖ్ చాలా మంచివాడని, కష్టపడి పనిచేసే నటుడని, అతనిపై ఎక్కువగా అరిచే అవసరమే వచ్చేది కాదని పేర్కొన్నారు.
ఫరా ఖాన్, షారుఖ్ ఖాన్ల స్నేహం మూడు దశాబ్దాలకు పైగా కొనసాగుతోంది. 1994లో వచ్చిన ‘కభీ హా కభీ నా’ సినిమా సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత 2004లో ‘మెయిన్ హూన్ నా’, 2007లో ‘ఓం శాంతి ఓం’, 2014లో ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమాలకు కలిసి పనిచేశారు.
మళ్లీ దర్శకత్వం చేపడితే షారుఖ్ ఖాన్‌తోనే సినిమా చేస్తానని ఫరా గతంలో కూడా వెల్లడించారు. ఈ ఏడాది చివర్లో సినిమా ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు ఆమె తెలిపారు.

