ధనత్రయోదశి..వ్యాపారుల భారీ ఆశలు!

1
- Advertisement -

ధనత్రయోదశి సందర్భంగా దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో వ్యాపార లావాదేవీలు జరగనున్నాయి. ఈ ఒక్కరోజే దేశవ్యాప్తంగా రూ.లక్ష కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనా వేసింది. ఇందులో బంగారం, వెండి విక్రయాల వాటానే రూ.60 వేల కోట్లకు పైగా ఉంటుందని వెల్లడించింది.

బంగారు ఆభరణాలు, వెండి నాణేలు, సంప్రదాయ బహుమతులు కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారని వ్యాపార సంఘం తెలిపింది. బంగారం, వెండి ధరలు అధికంగా ఉన్నప్పటికీ పండుగ కొనుగోళ్లపై ప్రజల ఆసక్తి తగ్గలేదని పేర్కొంది.

ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్‌స్మిత్ ఫెడరేషన్ (AIJGF) వివరాల ప్రకారం.. మార్కెట్లో తేలికపాటి బంగారు ఆభరణాలు, వెండి నాణేలు, సంప్రదాయ వస్తువులకు డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా బంగారం ధరలు ఎక్కువగా ఉండటంతో వినియోగదారులు 14 క్యారెట్లు, 18 క్యారెట్ల తేలికపాటి ఆభరణాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు.

బంగారు ఆభరణాలతో పాటు వెండి నాణేలు, అలంకరణ వస్తువుల విక్రయాలు కూడా జోరుగా సాగుతున్నాయి. చేపలు, తాబేళ్లు, ఏనుగుల ఆకారాల్లో ఉండే సంప్రదాయ శుభప్రదమైన అలంకరణ వస్తువులకు కూడా మంచి డిమాండ్ ఉందని ఫెడరేషన్ వెల్లడించింది.

ధన్‌తేరస్ రోజున బంగారం, వెండి, ఇతర వస్తువులు కొనుగోలు చేయడం శుభప్రదమని భారతీయులు నమ్ముతారు. ఈ సంప్రదాయం కారణంగా ప్రతి ఏడాది ఈ పండుగ సందర్భంగా మార్కెట్లలో కొనుగోళ్లు పెరుగుతాయి. అయితే ఈ ఏడాది విలువైన లోహాల ధరలు గత ఏడాదితో పోలిస్తే సుమారు 20 శాతం పెరిగాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,41,840గా ఉంది.

Also Read:ఆసీస్ కన్సల్టెంట్‌ కోచ్‌గా మైక్ హస్సీ

గత వారం రోజుల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గినప్పటికీ, కొనుగోలుదారుల ఆసక్తి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా వివిధ మార్కెట్లలో అమ్మకాల సరళిని పరిశీలించిన అనంతరం పూర్తి వివరాలతో కూడిన నివేదికను విడుదల చేస్తామని ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్‌స్మిత్ ఫెడరేషన్ వెల్లడించింది.

- Advertisement -