డేటా రక్షణ చట్టంపై సుప్రీం

3
- Advertisement -

డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) చట్టం-2023లోని కొన్ని నిబంధనలను సవాలు చేస్తూ భారతీయ మీడియా సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ చట్టాన్ని మీడియా సంస్థలకు వర్తింపజేస్తే పరిశోధనాత్మక జర్నలిజానికి ఆటంకాలు ఏర్పడటంతోపాటు, వార్తా కథనాలకు సంబంధించిన సమాచార వనరుల గోప్యత దెబ్బతినే ప్రమాదం ఉందని పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల న్యూస్‌రూమ్‌ల కార్యకలాపాలు కూడా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడవచ్చని పేర్కొన్నారు.

మీడియా సంస్థలు సవాలు చేసిన నిబంధనల ప్రకారం, జర్నలిస్టులు తాము పరిశోధిస్తున్న వ్యక్తుల నుంచి వ్యక్తిగత సమాచార వినియోగానికి సమ్మతి తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చని పిటిషనర్లు వాదించారు. అలాగే వ్యక్తిగత సమాచారాన్ని ఎంతకాలం భద్రపరచాలి, ఎప్పుడు తొలగించాలి అనే నిబంధనలు వార్తా సేకరణ, ప్రచురణ ప్రక్రియపై ప్రభావం చూపవచ్చని తెలిపారు.

విచారణ సందర్భంగా మీడియా సంస్థల తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ, ఒక వ్యక్తి సమ్మతి ఇవ్వాలా వద్దా అనే నిర్ణయంపై జర్నలిస్టుల పని ఆధారపడే పరిస్థితి ఏర్పడవచ్చని అన్నారు. ఇది పరిశోధనాత్మక వార్తా కథనాలకు తీవ్ర ఆటంకంగా మారుతుందని పేర్కొన్నారు.

Also Read:ఆర్నబ్ తుపాన్..ఏపీకి భారీ ముప్పు!

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. చట్టంలోని నిబంధనల దుర్వినియోగాన్ని గుర్తించడంలో పిటిషనర్ మీడియా సంస్థలు నిపుణులుగా సహాయపడగలవని ధర్మాసనం మౌఖికంగా వ్యాఖ్యానించింది. అదే సమయంలో అమాయక పౌరుల హక్కులకు రక్షణ కల్పించడం కూడా అవసరమని పేర్కొంది.

మీడియా స్వేచ్ఛ, పౌరుల వ్యక్తిగత సమాచార గోప్యత మధ్య సమతుల్యత ఉండాలని కోర్టు అభిప్రాయపడింది. ఈ చట్టం జర్నలిస్టులను నియంత్రించేందుకు ఉద్దేశించినది కాదని, మీడియా సంస్థలకు వర్తింపజేస్తే వార్తల ప్రచురణకు ముందస్తు సెన్సార్‌షిప్‌ విధించినట్లవుతుందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం తన స్పందన తెలియజేయాల్సి ఉంది.

- Advertisement -