హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ పరిధిలో గురువారం ఉదయం భూమి కంపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఉదయం సుమారు 9.15 గంటల సమయంలో ఉప్పర్‌పల్లి, అత్తాపూర్, లంగర్‌హౌస్, ఎర్రగడ్డ, కేశవస్వామి నగర్ ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ శబ్దాలు వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ శబ్దాలు బ్లాస్టింగ్‌ను తలపించడంతో అసలు ఏం జరిగిందో తెలియక ప్రజలు ఆందోళనకు గురయ్యారు.
రాజేంద్రనగర్ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో సుమారు 10 సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. అదే సమయంలో భారీ పేలుడు శబ్దాలు వినిపించడంతో ఇళ్లలో ఉన్న ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. భూకంపం సంభవించిందా? లేదా సమీపంలో ఎక్కడైనా బ్లాస్టింగ్ జరిగిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కసారిగా భారీ శబ్దాలు రావడం, భూమి కంపించినట్లు అనిపించడంతో చిన్నారులు, వృద్ధులు సహా పలువురు భయాందోళనకు గురయ్యారు.
Also Read:తెలంగాణ ప్రభుత్వం నిద్రపోతుందా?
ఉదయం వేళ వినిపించిన భారీ శబ్దాలకు కారణమేంటన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. భూకంపం కారణంగా భూమి కంపించిందా? నిర్మాణ పనుల్లో భాగంగా బ్లాస్టింగ్ జరిగిందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం.

