తీవ్ర స్థాయికి సూపర్-డూపర్ ఎల్‌నినో

2
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో భారీ మార్పులకు కారణమవుతున్న ఎల్‌నినో మరింత తీవ్ర రూపం దాల్చుతున్నట్లు వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది ఎల్‌నినో కనీసం 1950 తర్వాత నమోదైన అత్యంత బలమైన ఎల్‌నినోల్లో ఒకటిగా ఉండొచ్చని ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) అంచనా వేసింది. మానవ కార్యకలాపాల కారణంగా పెరుగుతున్న వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎల్‌నినో మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉందని పేర్కొంది.

వాతావరణ శాస్త్రవేత్త ర్యాన్ మాయే ప్రపంచ ఉష్ణోగ్రతల పరిస్థితిని చూపించే మ్యాప్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘భూమి దాదాపు మొత్తం ఎరుపు రంగులో కనిపిస్తోంది’ అంటూ ఎల్‌నినో అత్యంత గరిష్ఠ స్థాయిలో కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. 2027 ఫిబ్రవరి వరకు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉందన్న WMO అంచనాతో ఆయన ఏకీభవించారు.

క్లైమేట్ సైంటిస్ట్ జీక్ హౌస్‌ఫాదర్ కూడా ఎల్‌నినో గతంలో ఎన్నడూ చూడని స్థాయికి చేరుతోందని తెలిపారు. పసిఫిక్ మహాసముద్రంలోని నినో 3.4 ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సాధారణం కంటే 3.4 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవుతోందని వెల్లడించారు. వాతావరణ నిపుణుడు లియోన్ సిమన్స్ ఈ పరిస్థితిని ‘సూపర్-డూపర్ ఎల్‌నినో’గా అభివర్ణించారు.

WMO అంచనా ప్రకారం 2026 చివరి నెలల్లో ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా ఉండే అవకాశముంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య మధ్య, తూర్పు ఉష్ణమండల పసిఫిక్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే సుమారు 3.7 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉండొచ్చని అంచనా.

Also Read:ఓట్లను దొంగిలించి ప్రధాని అయ్యారు!

ఎల్‌నినో అనేది సహజంగా ఏర్పడే ఎల్‌నినో-సదరన్ ఆసిలేషన్ (ENSO) వాతావరణ చక్రంలో వేడి దశ. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు, వర్షపాతంపై ప్రభావం చూపుతుంది. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర కరువుకు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకు దారితీయవచ్చు. ఇదిలా ఉండగా, యూనివర్సిటీ ఆఫ్ చికాగోకు చెందిన క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ పరిశోధకులు ఈ ‘సూపర్ ఎల్‌నినో’ కారణంగా 2026 జూన్ నుంచి 2027 ఫిబ్రవరి మధ్య ప్రపంచవ్యాప్తంగా సుమారు 4.51 లక్షల అదనపు మరణాలు సంభవించే అవకాశం ఉందని గత నెలలో అంచనా వేశారు.

- Advertisement -