CEC జ్ఞానేశ్ కుమార్‌కు భద్రత పెంపు

3
- Advertisement -

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ భద్రతను మరింత పెంచారు. ఆయనకు ఇప్పటికే Z+ స్థాయి భద్రత ఉండగా.. ప్రస్తుతం అదనపు భద్రతా సిబ్బందిని మోహరించినట్లు అధికారులు వెల్లడించారు. ఢిల్లీలో ఎన్నికల సంఘం కార్యాలయం, జ్ఞానేశ్ కుమార్ నివాసం వద్ద ఇటీవల చోటుచేసుకున్న నిరసనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

జ్ఞానేశ్ కుమార్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు 24 గంటల పాటు భద్రతా సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఆయన నివాసం చుట్టూ అదనపు బలగాలను మోహరించారు. మరోవైపు ఢిల్లీలోని ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం ‘నిర్వాచన్ సదన్’ వద్ద కూడా భద్రతను పెంచారు.

CISF సిబ్బందితో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF), CRPF, ఢిల్లీ పోలీసులకు చెందిన అదనపు సిబ్బందిని కూడా కార్యాలయం పరిసరాల్లో మోహరించినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల సంఘం కార్యాలయం ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాలతో పాటు భవనం చుట్టూ భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు.

ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) అంశంపై ప్రతిపక్ష పార్టీలు ఢిల్లీలో ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద నిరసనలు కొనసాగుతున్నాయి. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా కేంద్ర, రాష్ట్ర భద్రతా సంస్థలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.

ఇప్పటికే జ్ఞానేశ్ కుమార్‌కు Z+ భద్రత కొనసాగుతుండగా తాజా పరిణామాల నేపథ్యంలో దాని పరిధిని మరింత విస్తరించినట్లు సమాచారం. దేశ రాజధానిలో నిరసనలు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం కార్యాలయం, CEC నివాసం వద్ద భద్రతా ఏర్పాట్లను అధికారులు నిరంతరం సమీక్షిస్తున్నారు.

Also Read:ఓట్లను దొంగిలించి ప్రధాని అయ్యారు!

- Advertisement -