దేశంలో ఓటర్ల జాబితా సవరణ, ఓట్ల తొలగింపు అంశంపై రాజకీయ దుమారం కొనసాగుతున్న వేళ అభిజిత్ దీప్కే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓట్లను దొంగిలించడం, తొలగించడం ద్వారా వరుస ఎన్నికల్లో గెలిచి నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారని ఆయన ఆరోపించారు. బతికున్న ప్రజలను చనిపోయినవారిగా చూపించి ఓట్లను తొలగించారని విమర్శించారు.
‘చనిపోయింది ప్రజలు కాదు.. దేశ ప్రజాస్వామ్యం’ అని అభిజిత్ దీప్కే వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచనలతోనే ఎన్నికల జాబితాల నుంచి ఓట్లను తొలగించే ప్రక్రియ జరిగిందని ఆయన ఆరోపించారు. అయితే ఇవి ఆయన చేసిన రాజకీయ ఆరోపణలేనని, వాటికి సంబంధించిన ఆధారాలను ఆయన ఈ వ్యాఖ్యల్లో వెల్లడించలేదు.
ఆర్ఎస్ఎస్ భావజాలంపై కూడా అభిజిత్ దీప్కే విమర్శలు గుప్పించారు. ఆ భావజాలం రాజ్యాంగం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉందని అన్నారు. ‘గాంధీ ఆత్మ, అంబేద్కర్ వెన్నుముక, నెహ్రూ మేధస్సు’ దేశానికి అవసరమని పేర్కొన్నారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఆ భావజాలంపై పోరాడాలని పిలుపునిచ్చారు.
ఇదే సమయంలో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూతో మోదీ నాయకత్వాన్ని పోల్చుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఓట్ల తొలగింపు ద్వారా వరుస ఎన్నికల్లో విజయం సాధించి నెహ్రూ కంటే ఎక్కువ కాలం అధికారంలో కొనసాగాలని మోదీ భావిస్తున్నారని ఆరోపించారు. నెహ్రూ కంటే గొప్ప నాయకుడిగా ఎదగాలని మోదీ కోరుకుంటున్నారని, అయితే అందుకు ఆయనకు అర్హత, స్థాయి లేవని అభిజిత్ దీప్కే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Also Read:UPI MDR వాయిదా..పేటీఎంషేర్ల పతనం
1951లో దేశంలో ఎన్నికలపై ప్రజలకు పెద్దగా అవగాహన లేని సమయంలోనే నెహ్రూ ఎన్నికలను నిర్వహించారని ఆయన గుర్తుచేశారు. ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన తక్కువగా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అభిజిత్ దీప్కే పిలుపునిచ్చారు.

