రాజీనామా చేశాక.. సస్పెండ్ చేస్తారా..?

282
sunitha laxmareddy
- Advertisement -

టీకాంగ్రెస్‌ నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సునీతా త్వరలో టీఆర్ఎస్‌లో చేరనున్నారు. ఈ నేపథ్యంలో సునీతను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ క్రమశిక్షణా కమిటీ ప్రకటన విడుదల చేసింది.

అయితే, క్రమక్షిక్షణా కమిటీ నిర్ణయాన్ని ఎద్దేవా చేశారు సునీతా లక్ష్మారెడ్డి. తాను పార్టీకి రాజీనామా చేశాక సస్పెండ్ చేయడం ఏంటని ప్రశ్నించారు.కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపం ఉందన్నా ఆమె… కార్యకర్తలు, అభిమానుల కోరిక మేరకు పార్టీని వీడాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఇది అర్థంలేని చర్యని ఆమె మండిపడ్డారు.

సీఎం కేసీఆర్,కేటీఆర్‌లతో భేటీ అయిన సునీత ఏప్రిల్ 3న టీఆర్ఎస్‌లో చేరనున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచార బహిరంగ సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో సునీతారెడ్డి టీఆర్ఎస్‌లో చేరనున్నారు.

నర్సాపూర్ నియోజకవర్గంలో శివ్వంపేట మండలంలోని గోమారం గ్రామానికి చెందిన సునీతాలక్ష్మారెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో, ప్రభుత్వంలో పలు కీలక పదవుల్లో పని చేశారు. భర్త లక్ష్మారెడ్డి మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఆమె సీపీఐ కంచుకోటను బద్దలు కొట్టారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ ఉద్దండ నేత విఠల్‌రెడ్డిని ఓడించి తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లోనూ గెలుపొంది హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు. రెండు పర్యాయాలు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. వివాదరహితురాలిగా, సౌమ్యురాలిగా పేరున్న ఆమెకు పార్టీలో మంచి గుర్తింపు ఉంది.

- Advertisement -