కేటీఆర్‌ బర్త్‌ డే.. విజయవంతమైన గిఫ్ట్ ఎ స్మైల్ ఛాలెంజ్..

1039
ktr
- Advertisement -

టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ జన్మదిన వేడుకలు నేడు ఘనంగా జరిగాయి. కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని తమ చుట్టుపక్కల ఉన్న వారికి ఎంతోకొంత సహాయ పడాలనే సదుద్దేశ్యంతో ప్రారంభమైన గిఫ్ట్ ఎ స్మైల్ ఛాలెంజ్ విజయవంతమైంది.కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రారంభించిన గిఫ్ట్ ఎ స్మైల్ ఛాలెంజ్ కార్యక్రమంలో పలువురు ప్రముఖులతో పాటు సాధారణ పార్టీ కార్యకర్తలు, కేటీఆర్ అభిమానులు పాల్గొన్నారుఇందులో భాగంగా తమ చుట్టుపక్కల ఉన్న వృద్ధాశ్రమాలు,పాఠశాలలు మరియు ఇతర మార్గాల్లో ఎంతో కొంత సహాయం అందిస్తూ కేటీఆర్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

గత రెండు రోజుల కింద తన పుట్టిన రోజు సందర్భంగా ప్రకటనలు, హోర్డింగులు, పూలబోకేలు, కేకులపైన కాకుండా ఈ గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో పాల్గొనాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. దీంతో గిఫ్ట్ ఎ స్మైల్ హ్యష్ ట్యాగ్‌తో ట్విట్టర్‌లో ఊపందుకుంది. గిఫ్ట్ ఎ స్మైల్ హ్యష్ ట్యాగ్ ఉపయోగిస్తూ అనేక మంది ప్రముఖులు కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్ జనరల్ కేథరిన్ హడ్డా నగరంలోని ఒక సేవా సంస్ధకు తన సొంత నిధుల నుంచి డొనేషన్ ఇచ్చి, తమ ప్రియమిత్రుడు కేటీఆర్‌కు శుభాకాంక్షలు అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

దీంతో పాటు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కీసరలోని సుమారు 2042 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ను అభివృద్ధి చేస్తానని, నగర పౌరులకు ఒక లంగ్ స్పేస్ క్రియేట్ చేస్తామని కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా హామీ ఇచ్చారు. అలాగే ఎమ్మెల్సీ కె నవీన్ రావుతో పాటు నగర మేయర్ బొంతు రామ్మోహన్, మేయర్ బాబా ఫసియుద్దీన్, పలువురు ఎమ్మెల్యేలు ఇలా అనేక మంది గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

చాలా మంది పార్టీ కార్యకర్తలు, కేటీఆర్ అభిమానులు తమ తమ స్థాయిల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనేక మంది ఎన్నారైలు సైతం తాము నివసిస్తున్న దేశాలలో ఆహార పంపిణీ లేదా చారిటీ సంస్థలకు డొనేషన్ ఇవ్వడం జరిగింది. తెలంగాణలో పలుచోట్ల రక్తదాన కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది. కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మంత్రులు మరియు ఎమ్మెల్యేలు,యంపిలు, పార్టీ నాయకులు కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో టాలీవుడ్ హీరో నితిన్ కూడా పాల్గొని ఈ చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు.

తన పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో భాగస్వాములై సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరికీ, తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -