అసెంబ్లీ అంటే సినిమా షూటింగ్ కాదు!

1
- Advertisement -

తమిళనాడు రాజకీయాల్లో అధికార తమిళగ వెట్రి కజగం (TVK), ప్రతిపక్ష డీఎంకే (DMK) ల మధ్య మాటల యుద్ధం ముదిరింది. శాసనసభలో ముఖ్యమంత్రి విజయ్ చేసిన ప్రసంగం…ఆయన ప్రదర్శించిన హావభావాలపై డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ అనేది ప్రజా సమస్యలను చర్చించే పవిత్రమైన వేదిక అని అది సినిమా షూటింగ్ సెట్ కాదంటూ చురకలు అంటించారు.

ఇటీవల అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ దాదాపు 45 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంలో ఆయన గత డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేయడమే కాకుండా…ఎం.కె. స్టాలిన్‌ను ఉద్దేశించి కనిపించకుండా పోయిన వ్యక్తి అంటూ ఒక కథను చెప్పారు. అంతటితో ఆగకుండా స్టాలిన్ సాధారణంగా రాజకీయ వేదికలపై చేసే ఒక విలక్షణమైన చేతి సైగను అసెంబ్లీలోనే అనుకరిస్తూ వెటకారం చేశారు. ఇది డీఎంకే శ్రేణులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.

Also Rea:TMC:ఈసీ ముందుకు టీఎంసీ సంక్షోభం!

విజయ్ ప్రసంగంపై డీఎంకే శాసనసభ పక్ష సమావేశం అనంతరం ఎం.కె. స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రవర్తించిన తీరు హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ అనేది ప్రజా సమస్యలపై చట్టాలు చేసే సభ. ఇక్కడ ప్రజల కష్టాల గురించి మాట్లాడాలి తప్ప, సినిమాల్లో లాగా చేతులు తిప్పుతూ, హావభావాలు ప్రదర్శిస్తూ ఫిల్మీ డైలాగులు చెప్పడం సరికాదు. ముఖ్యమంత్రి విజయ్ బహుశా ఇంకా సినిమా షూటింగ్ మూడ్‌లోనే ఉన్నట్టున్నారు. సభలో ఉన్నది అసెంబ్లీ లైవ్ కెమెరా మాత్రమే, సినిమా షూటింగ్ కెమెరా కాదనే విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలి అని స్టాలిన్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

విజయ్ చేసిన అవినీతి ఆరోపణలను స్టాలిన్ పూర్తిగా తోసిపుచ్చారు. ఒక ముఖ్యమంత్రి సభలో మాట్లాడేటప్పుడు బాధ్యతగా మాట్లాడాలని, బురదజల్లే రాజకీయాలు చేయాలనుకుంటే దానికి తగిన ఆధారాలను సభ ముందు ఉంచాలని డిమాండ్ చేశారు.

- Advertisement -