తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో అంతర్గత సంక్షోభం మరింత ముదిరింది. పార్టీపై ఆధిపత్యం, పార్టీ పేరు, గుర్తు కోసం జరుగుతున్న పోరు ఇప్పుడు ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘంకు చేరింది. అధిష్టానంపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేల బృందం, అలాగే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని అధికారిక వర్గం.. పరస్పరం తామే అసలైన టీఎమ్‌సీ అంటూ ఎన్నికల సంఘానికి వేర్వేరు జాతీయ కార్యవర్గ కమిటీల జాబితాలను సమర్పించాయి.
మమతా బెనర్జీపై తిరుగుబాటు చేసిన శాసనసభ్యుల బృందం మంగళవారం సాయంత్రం పశ్చిమ బెంగాల్ ముఖ్య ఎన్నికల అధికారిని కలిసింది. తామే అసలైన ‘ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్’ అని గుర్తిస్తూ, పార్టీ ఎన్నికల గుర్తు అయిన ‘జంట పువ్వుల’ను తమకే కేటాయించాలని కోరుతూ ఒక లేఖను సమర్పించారు.
అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైన రితాబ్రతా బెనర్జీ (తిరుగుబాటు వర్గం నేత) మీడియాతో మాట్లాడుతూ… పార్టీ గుర్తు విషయంలో ఎలాంటి వివాదం లేదని స్పష్టం చేశారు. మేమే అసలైన తృణమూల్ కాంగ్రెస్. రాష్ట్రంలోని మెజారిటీ ప్రజాప్రతినిధులు మా వైపే ఉన్నారు. కాబట్టి గుర్తును క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరమే రాలేదు, అది మాదే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందే తిరుగుబాటు వర్గం మమతా బెనర్జీని పార్టీ అధ్యక్ష పదవి నుండి తొలగిస్తున్నట్లు అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం.
మరోవైపు మమతా బెనర్జీ నేతృత్వంలోని అధికారిక వర్గం సోమవారం రాత్రి ఎన్నికల సంఘానికి సవరించిన నూతన కమిటీ జాబితాను పంపింది. జూన్ 20, 2026 నాటి ఈ జాబితా ప్రకారం.. పార్టీ అధ్యక్షురాలిగా మమతా బెనర్జీ, జాతీయ ప్రధాన కార్యదర్శిగా అభిషేక్ బెనర్జీ యథావిధిగా కొనసాగుతారని పేర్కొన్నారు. తిరుగుబాటుదారులు ఎన్ని కమిటీలు వేసుకున్నా చెల్లవని, మెజారిటీ ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారని మమత వర్గం గట్టిగా వాదిస్తోంది.
ఈ సంక్షోభంలో టీఎమ్‌సీకి చెందిన 80 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 58 మంది ఎమ్మెల్యేలు మమతా బెనర్జీ నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగరేశారు. వీరంతా కలిసి సోవందేబ్ ఛటోపాధ్యాయ స్థానంలో రితాబ్రతా బెనర్జీని అసెంబ్లీలో కొత్త నేతగా ఎన్నుకున్నారు. తిరుగుబాటు వర్గం 30 మంది సభ్యులతో కూడిన కొత్త జాతీయ కార్యవర్గ కమిటీని (NWC) ప్రకటించింది. మమతా బెనర్జీ ఇకపై పార్టీకి కేవలం ఒక ‘మెంటార్’ (మార్గదర్శి) పాత్రకు మాత్రమే పరిమితం కావాలని వారు స్పష్టం చేశారు. ఈ కొత్త కమిటీలో ఫిర్హాద్ హకీమ్, అరూప్ బిస్వాస్, రథిన్ ఘోష్, సబినా యాస్మిన్ వంటి ప్రముఖ నేతలను వైస్ ప్రెసిడెంట్లుగా నియమించారు. కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Also Read:NGOలపై కేంద్రం ఉక్కుపాదం!

