డీఎంకేలో ఓ శకం ముగిసింది. 50 ఏళ్లకు పైగా డీఎంకే అధ్యక్షుడిగా,63 ఏళ్లు ప్రజాప్రతినిధిగా తమిళ రాజకీయాల్లో చెరగని ముద్రవేశారు కరుణా. ఆయన మృతితో తమిళనాడు శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో కరుణానిధి వారసుడు ఎవరనే దానిపై ఆసక్తికర చర్చ మొదలైంది. ప్రస్తుతం డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న స్టాలిన్‌కు పగ్గాలు అప్పగించడం లాంఛనమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పార్టీపై పూర్తిస్థాయిలో పట్టు ఉండడం, ఆయనను ఢీకొనే నేతలు మరెవరూ లేకపోవడంతో ఆయన ఎన్నిక తప్పదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కరుణానిధి సైతం పలు సందర్భాల్లో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ప్రచార బాధ్యతను భుజాన వేసుకున్న స్టాలిన్…అన్నాడీఎంకేకు గట్టిపోటి నివ్వడంలో సక్సెస్ అయ్యారు.
స్టాలిన్ పొలిటికల్ ఎంట్రీ కోసం ఎంతో శ్రమించారు కరుణానిధి. స్టాలిన్‌ను రాజకీయాల్లోకి తెచ్చే క్రమంలో డీఎంకేలో చీలిక వచ్చిన వెనక్కి తగ్గలేదు. సీనియర్ నేత వైగో డీఎంకేని వీడి ఎండీఎంకేను ఏర్పాటుచేశారు. అయినా వెనక్కి తగ్గలేదు కరుణానిధి. చివరికి పెద్ద కుమారుడు అళగిరి-స్టాలిన్ మధ్య ఆధిపత్య పోరు నడిచిన నేపథ్యంలో కూడా స్టాలిన్‌కే మద్దతిచ్చారు కరుణానిధి.
2006 ఎన్నికల తర్వాత స్టాలిన్‌కు డిప్యూటీ సీఎం చేశారు కరుణా. 2009 ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికైన అళగిరిని కేంద్రమంత్రిని చేసి స్టాలిన్‌కు పార్టీలో అందలం ఎక్కించారు. గత ఎన్నికల సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ అళగిరిపై బహిష్కరణ వేటు వేయించారు.