దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలను సవరించే ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం మరో ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక సంక్షిప్త సవరణ (Special Summary Revision – SSR) చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, ఒడిశా, సిక్కిం రాష్ట్రాలతో పాటు చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ చేపట్టనున్నారు.
ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాల్లో కొత్త పేర్లను చేర్చడం, అనర్హుల పేర్లను తొలగించడం, వివరాల్లో తప్పులను సరిచేయడం SSR ప్రక్రియలో భాగంగా ఉంటుంది. అయితే SIR ప్రక్రియలో మాత్రం ఓటర్ల జాబితాలను పూర్తిగా పునఃపరిశీలించి కొత్తగా రూపొందిస్తారు.
2027 జనవరి 1ని అర్హత ప్రామాణిక తేదీగా తీసుకుని ఓటర్ల నమోదును చేపట్టనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. 2027 ఏప్రిల్ 1, జులై 1, అక్టోబర్ 1 అర్హత తేదీలకు సంబంధించి ముందస్తు దరఖాస్తులను కూడా స్వీకరించనున్నారు.ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 20లోగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తి చేయాలి. నవంబర్ 30న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 30 వరకు ఓటర్లు తమ అభ్యంతరాలు, కొత్త పేర్ల నమోదు కోసం దరఖాస్తులు సమర్పించవచ్చు. వాటిని పరిశీలించిన అనంతరం 2027 జనవరి 21న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు.
ఇప్పటికే గత నెలలో అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, మణిపూర్, పుదుచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్‌తో పాటు అసోంలోనూ SSR నిర్వహణకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
Also Read:అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీ పాదయాత్ర
మరోవైపు ఆంధ్రప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మేఘాలయ, నాగాలాండ్, ఢిల్లీ, త్రిపుర, తెలంగాణ రాష్ట్రాల్లో SIR ప్రక్రియ కొనసాగుతున్నందున లేదా ఇటీవలే పూర్తయినందున SSR షెడ్యూల్‌ను తర్వాత ప్రకటించనున్నట్లు ఈసీ తెలిపింది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లడఖ్ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఓటర్ల జాబితాల సవరణ షెడ్యూల్‌ను ప్రకటిస్తామని వెల్లడించింది.

