బాహుబలి సినిమాలో శ్రీదేవి శివగామి పాత్రను తిరస్కరించడానికి కారణాలేంటని ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జోరుగానే జరుగుతున్నాయి. అయితే ఇప్పుడా రూమర్లకు చెక్ పెట్టింది శ్రీదేవి.
శివగామి పాత్రకోసం తమ టీమ్ శ్రీదేవిని అప్రోచ్ అయినప్పుడు ఆమె అనుచిత డిమాండ్లు పెట్టిందని ఇటీవలే జక్కన్న చేసిన ఆరోపణలపై అతిలోక సుందరి తీవ్రంగా స్పందించింది.తన తాజా చిత్రం మామ్ ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన శ్రీదేవి.. ఈ ఆరోపణలను తిప్పికొట్టింది.
ప్రత్యేకించి పారితోషకాన్ని భారీగా డిమాండ్ చేయడం వల్లనే బాహుబలి యూనిట్ తనను వదులుకుందని జరుగుతున్న ప్రచారాన్ని ఆమె తప్పుపట్టింది. తను ఎనిమది కోట్ల రూపాయల పారితోషకం అడిగాను అనే ప్రచారాన్ని శ్రీదేవి ఖండించింది.
హోటల్ లో కొన్ని సూట్ రూమ్స్ ను అడిగాను, విమానం టికెట్లను అడిగాను అనే ప్రచారాన్ని కూడా తప్పుపట్టింది. అవన్నీ తప్పుడు ఆరోపణలే అని ఆమె స్పష్టం చేశారు.
అంతేకాకుండా ఓ ఆర్టిస్ట్ రెమ్యునరేషన్ గురించి పబ్లిగ్గా మాట్లాడే హక్కు ఏ సినీ దర్శక నిర్మాతకూ లేదని వ్యాఖ్యానించింది. బాహుబలే కాదు..ఎన్నో హిట్ సినిమాలను నా వ్యక్తిగత కారణాలవల్ల తిరస్కరించాను. అయితే ఆ సినిమాల ఫిల్మ్ మేకర్స్ ఎవరూ ఇలా మాట్లాడలేదని ఆమె తెలిపింది.
ఒక సినిమాను అంగీకరించడమో లేదా తిరస్కరించే హక్కు నాకు లేదా అని ప్రశ్నించింది. అనుచిత డిమాండ్లు పెడితే తాను 300 కు పైగా చిత్రాల్లో నటించేదాన్నా అని కూడా శ్రీదేవి ఎదురు ప్రశ్న వేసింది. మొత్తానికి శ్రీదేవి కామెంట్లకి జక్కన్న ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.