వార్నర్‌ విశ్వరూపం..

229
SRH victory against KKR
SRH victory against KKR
- Advertisement -

ఆదివారం ఉప్పల్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 209 పరుగులు చేసింది. అనంతరం భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 161 పరుగులు మాత్రమే చేసి 48 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ ఓపెనర్‌ డేవిడ్ వార్నర్ కోల్‌కతా బౌలర్లకు చుక్కలు చూపించాడు. కెప్టెన్ డేవిడ్ వార్నర్ ధాటికి 8.4 ఓవర్లలోనే సన్‌రైజర్స్‌ స్కోరు 100 పరుగులు దాటింది. చూస్తుండగానే వార్నర్‌ సెంచరీ పూర్తయింది. వార్నర్‌ సెంచరీ సాధించినప్పుడు జట్టు స్కోరు 126/0 కాగా.. ధావన్‌ వ్యక్తిగత స్కోరు 20 పరుగులే. వార్నర్‌తో కలిసి తొలి వికెట్‌కు 139 పరుగులు జోడించిన ధావన్‌ (29; 30 బంతుల్లో 2×4, 1×6) రనౌట్‌గా వెనుదిరిగాడు. 59 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీకి తరలించి అద్భుత శతకాన్ని 126 పరుగులు నమోదు చేశాడు వార్నర్. తరువాత వచ్చిన విలియమ్సన్ (40) కూడా బ్యాటుకు పని చెప్పడంతో నిర్ణీత ఓవర్లలో హైదరాబాద్ 209 పరుగులు చేసింది.

210 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన కోల్‌కతా 161 పరుగులకే చతికిల పడింది. ఈ సీజన్‌లో మంచి ఊపు మీదున్న సునీల్ నరైన్ (1) ఉసూరుమనిపించాడు. రాబిన్ ఉతప్ప (28 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53 పరుగులు) పోరాటం ఫలించలేదు. మనీష్ పాండే (39) ఒక్కడే కాస్త ఫర్వాలేదనిపించాడు. మిగతా బ్యాట్స్‌మెన్ అంతా వచ్చినవారు వచ్చినట్టే పెవిలియన్ చేరడంతో 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 161 పరుగులు మాత్రమే చేయగలిగింది. కాగా, వీరవిజృంభణ చేసిన హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, మహ్మద్ సిరాజ్, సిద్ధార్థ్ కౌల్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా రషీద్‌కు ఒక వికెట్ దక్కింది.

- Advertisement -