అటవీశాఖ సిబ్బందికి ప్రోత్సాహకాలు..

165
forest department
- Advertisement -

అన్ని జిల్లాల అటవీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు పీసీసీఎఫ్ ఆర్. శోభ.అడవుల రక్షణ, పునరుజ్జీవనం, పచ్చదనం పెంపుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని క్షేత్ర స్థాయిలో బాగా పనిచేస్తున్న సిబ్బందిని ప్రోత్సహించాలని అటవీ శాఖ నిర్ణయించింది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాల వారీగా ఆరు కేటగిరీల్లో అటవీ శాఖ సిబ్బందిని నగదు ప్రోత్సాహంతో కూడిన ప్రశంసా పత్రాన్ని అందించనున్నారు.

జిల్లా స్థాయిలో జరిగే వేడుకల్లో ఈ అవార్డుల ప్రదానం జరుగుతుంది. జంగల్ బచావో – జంగల్ బడావో నినాదంతో తెలంగాణకు హరితహారం ద్వారా జరుగుతున్న కార్యక్రమాలను ఈ ఎంపికకు ప్రాతిపదిక కానుంది. మంచి నర్సరీల నిర్వహణ, పెద్ద మొక్కల పెంపు, నాటిన మొక్కల సంరక్షణ, అటవీ రక్షణ పద్దతులు, చక్కటి పునరుజ్జీవన చర్యలు, అడవుల్లో నీటి సంరక్షణ, గడ్డి మైదానాల వృద్ధి, హరితహారంలో వివిధ వర్గాల భాగస్వామ్యం చేయటం లాంటి వాటిని పరిగణలోకి తీసుకుంటామని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి పీసీసీఎఫ్ ఆర్. శోభ వెల్లడించారు. అడవుల్లో క్షేత్ర స్థాయిలో పనిచేసే బీట్ అధికారి, సెక్షన్ ఆఫీసర్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లను ప్రోత్సాహకాల కోసం పరిగణిస్తారు.

అరణ్య భవన్ నుంచి అన్ని జిల్లాల అటవీ అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ మేరకు చర్చించారు. వచ్చే హరితహారం సీజన్ కోసం పెద్ద మొక్కల పెంపకం అన్ని నర్సరీల్లో చేపట్టాలని, గ్రామీణ ప్రాంతాల్లో ఎవెన్యూ ప్లాంటేషన్ కోసం కనీసం ఒకటిన్నర మీటరు ఎత్తైన మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలని పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్.ఎం.దోబ్రియల్ తెలిపారు. కంపా నిధుల కింద చేపట్టిన అటవీ అభివృద్ది పనుల్లో అలసత్వం క్షమించమని, చేపట్టిన పనులను థర్డ్ పార్టీ ద్వారా సమీక్షించటం, ఆమేరకు నిధుల విడుదల ప్రణాళికలు సిద్దం చేయాలని తెలిపారు. ఏదశలోనైనా పొరపాట్లు జరిగితే తదుపరి చర్యలకు సంబంధిత అధికారులు సిద్దంగా ఉండాలని పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్ హెచ్చరించారు.

సమావేశంలో ఇంకా అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణ, ముందస్తు ప్రణాళికలు, వన్యప్రాణుల రక్షణ, నీటి వసతి సౌకర్యాల కల్పన, నిర్వహణ, అటవీ ప్రాంతాల్లో రహదారులు, ఇతర ప్రభుత్వ పథకాల కోసం అనుమతులపై సమీక్ష జరిగింది.వీడియో కాన్ఫరెన్స్ లో పీసీసీఎఫ్ (అడ్మిన్) స్వర్గం శ్రీనివాస్, అదనపు పీసీసీఎఫ్ లు సిద్దానంద్ కుక్రేటీ, ఎం.సీ. పర్గెయిన్, ఇతర అధికారులు, అన్ని అటవీ సర్కిళ్లకు చెందిన చీఫ్ కన్జర్వేటర్లు, జిల్లా అటవీ అధికారులు, రేంజ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

- Advertisement -