నిజాంసాగర్ ప్రాజెక్ట్ కు పూర్వ వైభవం తీసుకురాడమే నా లక్ష్యం అన్నారు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. బాన్సువాడ మండలం దేశాయిపేట్, పోచారం గ్రామాలలో దేశాయిపేట్ ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు రాష్ట్ర శాసనసభ సభాపతి శ్రీనివాస రెడ్డి. ఈకార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి, దేశాయిపేట్ పి.ఏ.సి.ఎస్ అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి,.ఎస్.ఓ, డి.ఎం,సర్పంచులు,ఎంపీటీసీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ…. జిల్లాలో 223 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది, అవసరమైన గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. నియోజకవర్గ పరిధిలో గత ఏడాది 1.37 లక్షల ఎకరాలలో వరి సాగు చేయగా, ఈ ఏడాది 2 లక్షల ఎకరాలు సాగు చేశారు. గత ఏడాది 3.67 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయగా ఈ ఏడాది సుమారుగా 4.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం A గ్రేడ్ ధాన్యం రూ. 1835, సాధారణ రకం ధాన్యం రూ. 1815 తో కొనుగోలు జరుగుతుందన్నారు.
రైతులు ఇబ్బందులు ఎదుర్కోకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఎకరాకు ఏటా రెండు పంటలకు పుష్కలంగా సాగునీరు అందించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పలు పథకాలకు అనుమతులు మంజూరు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్ళను నిజాంసాగర్ ప్రాజెక్టులోకి తీసుకువచ్చి ఏటా రెండు పంటలకు సాగునీరు అందిస్తాం.