భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శనివారం గుండెపోటుకు గురయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో వెంటనే ఆయన్ను పశ్చిమబెంగాల్ లోని కోల్ కతా వుడ్‌ల్యాండ్ ఆస్పత్రిలో చేర్పించారు. నేటి సాయంత్రం కల్లా ఆయనకు యాంజియో ప్లాస్టీ చేయాలని డాక్టర్లు సూచించినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, కంగారు పడాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. యాంజియోప్లాస్టీ చేసిన తర్వాత భారత మాజీ కెప్టెన్‌ను శనివారం డిశ్చార్జ్ చేస్తారని బోరియా మజుందార్ ధ్రువీకరించారు.
కాగా, సౌరవ్ గంగూలీ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా, గంగూలీకి గుండెపోటు వచ్చిందన్న సమాచారం రాగానే ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన క్షేమం కోరుతూ వివిధ ఆలయాల్లో ప్రార్థనలు చేశారు.