బీసీసీఐకి 36వ అధ్యక్షుడిగా రోజర్‌

217
- Advertisement -

1983 వరల్డ్‌ కప్‌ విజేత మెంబర్‌, మాజీ ఆల్‌రౌండర్‌ రోజర్‌ బిన్నీని బీసీసీఐ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ముంబైలో జరిగిన 91వ వార్షిక సర్వసభ్య సమావేశంలో బీసీసీఐకి 36వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఉన్న సౌరవ్‌ గంగూలీ స్థానంలో రోజర్‌ బిన్నీ ని ఎన్నుకున్నట్టు ప్రకటించారు. ప్రపంచకప్‌ విజేతలు ఇప్పటివరకూ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నిక కాలేదు. రోజర్‌ బిన్నీ తొలి వ్యక్తిగా నిలిచారు. అధ్యక్ష పదవికి ఏటువంటి పోటీ లేకుండా రోజర్‌ ఎన్నికయ్యారు. బీసీసీఐ సెక్రటరీగా జే షా కొనసాగనున్నారు.

బీసీసీఐ అధ్యక్ష పదవి కోసం బిన్నీ మాత్రమే నామినేషన్‌ దాఖలు చేశారు. ఇక ఆఫీసు బేరర్ల ఎన్నిక కూడా లాంఛనం కానున్నది. బిన్నీ ఇప్పటి వరకు కర్నాటక క్రికెట్‌ సంఘం అధ్యక్షుడిగా చేశారు. ఇప్పుడు ఆ పదవిని ఆయన వదిలేయనున్నారు. సీనియర్‌ సెలక్షన్‌ కమిటీలో బిన్నీ సభ్యుడిగా పని చేశారు. ఆ సమయంలో సందీప్‌ పాటిల్‌ చైర్మెన్‌గా ఉన్నారు. బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగాలని గంగూలీకి ఉన్నా.. ఆయనకు రెండవ అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం ఆసక్తిగా లేనట్లు తెలుస్తోంది. కానీ ఐసీసీ చైర్మెన్‌గా గంగూలీ పోటీ పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

67 ఏళ్ల బిన్నీ 1979 నుంచి 1987వరకు కెరీర్‌ను కొనసాగించారు. తన కెరీర్‌లో 27 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 47 వికెట్లు తీశాడు. 1980 మరియు 1987 మధ్య 72 ODIలలో పాల్గొన్నారు. మీడియం పేసర్‌ అయిన బిన్నీ.. కపిల్‌ బృందంలో ఆల్‌రౌండర్‌ పాత్రను పోషించారు. 1983 వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టులో కీలక బౌలర్‌గా రాణించారు. ఈ టోర్నీలో ఎనిమిది మ్యాచ్‌ల్లో 18 వికెట్లు సాధించారు.

- Advertisement -