సింగరేణిలో 651 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్..

446
Singareni CMD
- Advertisement -

ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఆదేశం మేరకు సింగరేణి సంస్థలో ప్రస్తుతం గల 651 ఖాళీలను మార్చిలోగా భర్తీ చేయనున్నామని సింగరేణి సి&ఎం.డి. ఎన్‌.శ్రీధర్‌ తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం (జనవరి 8వ తేదీ) నాడు హైద్రాబాద్‌ నుండి విడుదల చేసిన ప్రకటనలో ఆయన వివరాలు తెలియజేశారు. ఈ రిక్రూట్‌ మెంట్‌ ప్రక్రియ మొత్తం మార్చి 2021 నాటికి పూర్తి చేస్తామని, అన్ని పోస్టులకు రాత పరీక్ష నిర్వహించి దానిలో ప్రతిభ చూపిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందని వివరించారు. 651 ఖాళీలలో 569 ఎన్‌.సి.డబ్ల్యు.ఎ. పరిధిలోని కార్మిక ఉద్యోగాలు, 82 అధికార పోస్టులు ఉన్నాయని, ప్రత్యేక నోటిఫికేషన్ల ద్వారా వీటిని భర్తీ చేయనున్నామని తెలిపారు.

సింగరేణి సంస్థ వివిధ విభాగాలలో గుర్తించి, భర్తీ చేయనున్న 569 కార్మిక పోస్టుల ఖాళీలకు సంబంధించిన పోస్టుల వివరాలు: జూనియర్‌ అసిస్టెంటు (క్లర్కులు)-177 పోస్టులు, ఫిట్టర్లు-128, ఎలక్ట్రిషీయన్లు టైనీలు-51, వెల్డర్ ట్రైనీలు-54, టర్నర్‌/ మెషినిస్టు ట్రైనీలు-22, మోటర్‌ మెకానిక్‌ ట్రైనీలు-14, మౌల్డర్ ట్రైనీలు-19 పోస్టులను ఎంపిక చేయబోతున్నారు. అలాగే ఆసుపత్రులలో వివిధ రకాల ఖాళీలను కూడా మార్చిలోగా భర్తీ చేయబోతున్నారు. దీనిలో జూనియర్‌ స్టాఫ్‌ నర్స్‌-84 పోస్టులు, ల్యాబ్‌ టెక్నిషీయన్లు-7, ఫార్మాసిస్టులు-5, అలాగే ఎక్స్‌-రే, ఇ.సి.జి., వెంటిలేటర్‌ విభాగాల్లో రెండేసి పోస్టులు, ఫిజియోథెరపీ, వెంటిలేటర్‌ విభాగంలో ఒక్కొక్క పోస్టును భర్తీ చేయనున్నారు.

కాగా వివిధ శాఖల్లో సింగరేణి సంస్థ గుర్తించి, భర్తీ చేయనున్న 82 ఖాళీలకు సంబంధించిన అధికార పోస్టుల వివరాలు: మైనింగ్‌ విభాగంలో మేనేజిమెంటు ట్రైనీలు-39 పోస్టులు, పర్సనల్‌ ఆఫీసర్‌-17, మేనేజిమెంటు ట్రైనీలు (ఇండస్ట్రీయల్‌ ఇంజనీరింగ్‌)-10, సివిల్‌ శాఖలో మేనేజిమెంటు ట్రైనీలు-7, మేనేజిమెంటు ట్రైనీలు (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ)-6, జూనియర్‌ అటవీ అధికారి-3 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు.

ముఖ్యమంత్రి ఆదేశంపై ఇంటర్నల్‌ అభ్యర్ధులకు గొప్ప సదవకాశం : 1,436 పోస్టుల్లో భర్తీ
సింగరేణిలో కారుణ్య నియామకాల ప్రక్రియ, డిపెండెంట్‌ ఉద్యోగాలలో భాగంగా సుమారు 10 వేల మందికి పైగా యువకులు సింగరేణిలో ఉద్యోగం పొందారు. వీరిలో అనేక మంది ఉన్నత విద్యార్హతలు కలిగి ఉన్నారు. కానీ బదిలీ వర్కర్లు లేదా జనరల్‌ మజ్దూర్లుగా పని చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఇటీవల శాసనసభలో మాట్లాడుతూ, సింగరేణిలో ఏర్పడే ఖాళీలలో సంస్థలో పనిచేస్తున్న అర్హులైన అభ్యర్ధులకు కూడా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన హామీ మేరకు వివిధ గనులు, విభాగాలు, కార్యాయాలల్లో ఖాళీగా ఉన్న 1,436 పోస్టులను ఇంటర్నల్‌ అభ్యర్ధుల కోసం గుర్తించి, వారితోనే భర్తీ చేయాలని నిర్ణయించినట్లు సి&ఎం.డి. ఎన్‌.శ్రీధర్‌ పేర్కొన్నారు. ఈ మేరకు త్వరలోనే ఇంటర్నల్‌ సర్క్యూలర్ల ద్వారా ధరఖాస్తులను ఆహ్వానించి, నియామకాలు చేపట్టనున్నామని తెలిపారు.

ఇంటర్నల్‌ రిక్రూట్‌ మెంట్‌లో ఇ.పి. ఆపరేటర్‌ ట్రైనీలు-210 పోస్టులు, ఇ.పి. ఆపరేటర్‌ ఫిట్టర్‌ ట్రైనీలు-178, క్లర్కులు (జూనియర్‌ అసిస్టెంట్స్‌)-177, వార్డు అసిస్టెంట్లు-175, ఆయా పోస్టులు-94, డ్రైవర్లు-64, వెల్డర్లు ట్రైనీలు-55, అసిస్టెంట్‌ ఫోర్‌ మెన్‌ (మెకానికల్‌) ట్రైనీలు-56, ఎలక్ట్రీషీయన్‌ ట్రైనీలు-51, ఇ.పి. ఎలక్ట్రీషీయన్‌ ట్రైనీలు-42, పిట్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌ (పి.ఓ.ఎ.)-36, జూనియర్‌ అకౌంటెంట్లు-24, టర్నర్‌ మెషినిస్టు ట్రైనీలు-22, మౌల్డర్ ట్రైనీలు-19, మోటార్‌ మెకానిక్‌ ట్రైనీలు-14, స్టోర్‌ కీపర్స్‌-13, జూనియర్‌ ఫారెస్ట్‌ అసిస్టెంట్స్‌-8, ల్యాబ్‌ టెక్నిషీయన్లు-7, ‘లా’ అసిస్టెంట్స్‌-5, ఫార్మాసిస్ట్‌-5 పోస్టులతో పాటు, ఎక్స్‌రే, ఇ.సి.జి., వెంటిలేటర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు రెండేసి ఖాళీలు, డైటిషీయన్‌, ఫిజియోథెరపిస్టు, డయాలసిస్‌ టెక్నిషీయన్లకు ఒక్కొక్క పోస్టు చొప్పున గల ఖాళీలను ఇంటర్నల్‌ అభ్యర్ధుల ద్వారా మాత్రమే భర్తీ చేయనున్నారు.

తెలంగాణా రాష్ట్రం ఏర్పడినాకా 13,934 ఉద్యోగాలు కల్పించిన సింగరేణి..
సింగరేణి సంస్థ తన బొగ్గు ద్వారా, థర్మల్‌ విద్యుత్‌ ఉత్పాదన ద్వారా రాష్ట్రాభివృద్ధికి తోడ్పడడంతో పాటు, రాష్ట్రావతరణ తర్వాత తొలిసారిగా కొత్త ఉద్యోగాలు కల్పించిన ఘనతను కూడా సాధించింది. 2014 నుండి ఇప్పటి వరకు 13,934 ఉద్యోగాలను కల్పించి రాష్ట్రంలో అత్యధిక ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వ సంస్థగా నిలిచింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశం మేరకు కారుణ్య ఉద్యోగల నియామకల ప్రక్రియ కింద ఇప్పటివరకూ 10,879 ఉద్యోగాలు కల్పించగా, 45 ఎక్స్‌టర్నల్‌ రిక్రూట్‌ మెంటు నోటిఫికేషన్లు జారీ చేసి 3,055 మంది యువతను ఉద్యోగాలలో నియమించింది. కాగా తాజాగా కంపెనీ మరో 651 పోస్టులను డైరెక్టు రిక్రూట్‌ మెంట్‌ ద్వారా మార్చి 2021 నాటికి భర్తీ చేయనుంది.

కాగా 75 ఇంటర్నల్‌ నోటిఫికేషన్ల ద్వారా ఇంటర్నల్‌ అభ్యర్ధులకు 2,501 ఉద్యోగాల కల్పించింది. అలాగే తాజా ఇంటర్నల్‌ రిక్రూట్‌ మెంట్‌ ద్వారా మరో 1,436 పోస్టులను మార్చికల్లా భర్తీ చేయనుంది. ఇవికూడా పూర్తయితే, మార్చి 2021 నాటికి సింగరేణి సంస్థ తెలంగాణ ఆవిర్భావం తర్వాత కొత్తగా కల్పించిన ఉద్యోగాల సంఖ్య 18,522 చేరనుంది. దీనిపై సింగరేణి కార్మికులు వారి కుటుంబ సభ్యులతో పాటు సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఇంత పెద్దఎత్తున రాష్ట్రంలోనే కాదు దేశంలోని ఏ ప్రభుత్వ రంగ సంస్థ యువతకు ఉద్యోగాలు కల్పించిన సందర్భాలు లేవని వారు ప్రశంసిస్తున్నారు.

ప్రతిభ ఆధారంగానే ఉద్యోగ నియామకాలు : యాజమాన్యం
సింగరేణి సంస్థ చేపట్టనున్న అన్ని నియామకాలు అభ్యర్ధుల ప్రతిభ, రాత పరీక్షలో వారికి వచ్చే మార్కుల పైనే ఆధారపడి ఉంటాయనీ, కనుక పరీక్షలకు బాగా సంసిద్ధమవ్వాలని యాజమాన్యం సూచిస్తోంది. ఇంటర్వ్యూ అనే ప్రక్రియ ఉండదనీ, కనుక ఎటువంటి పైరవీలకు అవకాశం ఉండబోదనీ, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎవరైనా చేప్తే వారి మాటలకు మోసపోవద్దని యాజమాన్యం హెచ్చరిస్తోంది.

- Advertisement -