సింగరేణిలో ఏ ఒక్కరూ కరోనాకు బలికాకూడదు:సీఎండీ శ్రీధర్

178
sccl
- Advertisement -

సింగరేణి కాలరీస్‌ కంపెనీలో ఏ ఒక్క కార్మికుడు, అధికారి లేదా అతని కుటుంబ సభ్యులు కరోనాకు బలికారాదన్న లక్ష్యంతో వారి రక్షణకు, వైద్య సేవలకు ఎంతటి ఖర్చుకైనా వెనుకాడకుండా కృషి చేయాలని, కరోనా వ్యాప్తి నివారణతో పాటు ప్రతీ ఒక్కరి రక్షణ బాధ్యతను స్థానిక యాజమాన్యాలు చేపట్టాలని సింగరేణి సి&ఎం.డి. శ్రీ ఎన్‌.శ్రీధర్‌ విస్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు.

సోమవారం (ఆగష్టు 10వ తేదీ) నాడు ఆయన హైద్రాబాద్‌ సింగరేణి భవన్‌ నుండి సింగరేణి డైరెక్టర్లు, ఏరియా జి.ఎం.లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అనేక విషయాలపై స్పష్టతనిస్తూ పలు ఆదేశాలను, అనుమతులను కూడా ప్రకటించారు.కరోనా వ్యాధితో ఏ ఒక్క కార్మికుడు, అధికారి లేదా అతని కుటుంబ సభ్యులు మృతి చెందకూడదు అనే లక్ష్యంతో ప్రతీ అధికారి పనిచేయాలి. ప్రస్తుతం ఉన్న కార్పోరేటు ఆసుపత్రులతో పాటు, కరోనా రోగుల అత్యవసర సేవల కోసం, సాధ్యమైనన్ని ఎక్కువ సంఖ్యలో వెంటిలేటర్‌ సౌకర్యం గల ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకోవాలి. కనీసం 200 బెడ్లు సింగరేణి పేరుతో సంసిద్ధంగా ఉంచుకోవాలి అని ఆయన ఆదేశించారు.

సింగరేణి ప్రాంతాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్నందున ప్రతి ఏరియాలో రోజుకి 200కు పైగా టెస్టులు నిర్వహించాలి. అవసరమైన ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లు యాజమాన్యం సరఫరా చేస్తుంది. దీనితో పాటు ప్రతీ ఆసుపత్రిలో లేబోరేటరీ సౌకర్యాలు విస్తరించాలి. అవసరమైతే ప్రైవేటు ల్యాబ్‌ టెక్నిషియన్లను నియమించుకోవాలి. అన్ని కంపెనీల ఆసుపత్రుల్లో కరోనాకు అత్యవసర మందులు తగిన సంఖ్యలో సిద్ధంగా ఉంచుకోవాలి’’ అని సి&ఎం.డి. శ్రీ ఎన్‌.శ్రీధర్‌ సృష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ‘‘ఈ ఆపత్కాల సమయంలో వైద్య సిబ్బంది సేవలు ప్రశంసనీయం. వారి కృషికి, సేవలకు తగిన గుర్తింపు ఉంటుంది. అయితే ఎవరైనా సిబ్బంది విధులను నిరాకరించినా, తప్పించుకోవాలని చూసినా వారిని ఉపేక్షించబోము’’ అని పేర్కొన్నారు.

సింగరేణి వ్యాప్తంగా కరోనా నివారణ చర్యలను, కరోనా వైద్య సేవలను పర్యవేక్షించడానికి ప్రతీ ఏరియాలో ఒక బాద్యత గల అధికారిని కో-ఆర్డినేటర్‌గా నియమించి, అతని నేతృత్వంలో కొంత మంది చురుకైన అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సి&ఎం.డి. ఆదేశించారు. ఈ కమిటీ కేవలం కరోనా నియంత్రణ, క్వారంటైన్‌ సెంటర్ల నిర్వహణ, వైద్య సేవలు వంటి విషయాలపై దృష్టిపెట్టి 24 గంటలు పనిచేస్తుందనీ, ఎప్పటికప్పుడు డైరెక్టర్లకు నివేదిస్తూ, తగిన తక్షణ సూచనలు, ఆదేశాలు పొందుతుందని తెలిపారు.

ఇప్పుడు ఉన్న ఈ స్టాకుకు అదనంగా ఇంకా ఎంత కావాలన్నా మంజూరు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. క్వారంటైన్‌ సెంటర్ల సంఖ్య పెంచాలని అక్కడ కూడా ఎటువంటి చిన్న లోపం రాకుండా పక్కాగా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. పాజిటివ్‌ కేసులను క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించి పర్యవేక్షించాలని, వీరికోసం ప్రత్యేక మెడికల్‌ కిట్‌ యాజమాన్యం అందజేస్తోందన్నారు. ఈ కిట్‌ లో ఆవిరి యంత్రం, ఆక్సిమీటర్‌, థర్మోమీటర్‌ తో పాటు 8 రకాల మందులతో కూడుకొని మొత్తం 16 వస్తువులు ఉంటాయని పేర్కొన్నారు. ఈ తరహా కిట్‌ ను మరో 1000 కొనుగోలు చేసి ఆసుపత్రులకు పంపించనున్నామని తెలియజేశారు.అన్ని ఏరియాల ఆస్పత్రుల్లో కరోనా నియంత్రణకు అవసరమైన చికిత్స, మందులు, ఇంజెక్షన్లతో సిద్ధంగా ఉండాని ఛైర్మన్‌&ఎం.డి. శ్రీ ఎన్‌.శ్రీధర్‌ ఆదేశించారు.ప్రతీరోజూ ఉదయం 7 గంటల కల్లా సింగరేణి వ్యాప్తంగా అప్పటివరకూ తీసుకొన్న చర్యలపై తనకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఎవరైనా తమకు కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే తక్షణమే కంపెనీ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని, తద్వారా వీరేకాక ఇతరులను కూడా కరోనా నుండి రక్షించిన వారు అవుతారని సి&ఎం.డి. శ్రీ ఎన్‌.శ్రీధర్‌ తెలిపారు. కరోనా లక్షణాలు ఉండి నిర్లక్ష్యంగా కనిపిస్తే వారిని తక్షణమే వైద్య కేంద్రాలకు తరలించి పరీక్షలు జరపాలని కూడా ఆయన ఆదేశించారు. సింగరేణి మొత్తం కరోనా కట్టడికి కలిసికట్టుగా పనిచేయాలని ఏ ఒక్క కార్మికుడు లేదా అధికారి వారి కుటుంబ సభ్యులు ఎవరూ కరోనాకు బలికాకూడదన్న లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

సోమవారం ఉదయం సంస్థ డైరెక్టర్లతో సుమారు 3 గంటలు సమీక్షించిన సి&ఎం.డి. శ్రీ ఎన్‌.శ్రీధర్‌ అదేరోజు సాయంత్రం ఏరియా జి.ఎం.లు, వైద్య అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష జరిపారు. కరోనా నివారణ చర్యల్లో అలసత్వాన్ని ఉపేక్షించేదిలేదని ఆయన సృష్టం చేశారు.ఈ వీడియో కాన్ఫరెన్సులో హైద్రాబాద్‌ కార్యాలయం నుండి ఛైర్మన్&ఎం.డి. శ్రీ ఎన్‌.శ్రీధర్‌తో పాటు డైరెక్టర్‌ ఆపరేషన్స్‌ మరియు పా శ్రీ ఎస్‌.చంద్రశేఖర్‌, డైరెక్టర్‌ ఫైనాన్స్‌ శ్రీ ఎన్‌.బలరాం, సి.ఎం.ఓ. డాక్టర్‌ మంథా శ్రీనివాస్‌ పాల్గొనగా వీరితో పాటు, అన్ని ఏరియాల నుండి జి.ఎం.లు పాల్గొన్నారు.

- Advertisement -