సింగరేణి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ సానుకూలమే..

481
Singareni C&Md
- Advertisement -

సింగరేణి సంస్థ ఉద్యోగుల సంక్షేమంపైన, సమస్యల పరిష్కారంపైన ఎప్పుడూ సానుకూల వైఖరితోనే ఉంటుందని, ఫలితంగా గత ఐదేళ్ల కాలంలో అనేక దీర్ఘకాలిక సమస్యలపై పలు చారిత్రక ఒప్పందాలు జరిగి అమలు చేసుకోవడం జరిగిందని సంస్థ సి అండ్ ఎం.డి. ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు.హైద్రాబాద్ సింగరేణి భవన్‌లో మంగళవారం (జూలై 2వ తేదీ) నాడు జరిగిన 37వ సిఅండ్ఎం.డి. స్థాయి స్ట్రక్చర్డు సమావేశంలో శ్రీధర్ మాట్లాడుతూ.. సమంజసమైన కార్మికుల సమస్యల పరిష్కారానికి తాము ఎప్పుడు సానుకూలంగా ఉంటామని సృష్టం చేశారు. అలాగే గుర్తింపు కార్మిక సంఘం కూడా సంస్థ స్థితి గతులను అర్థం చేసుకొని సంస్థ మనుగడకు, వృద్ధికి సహకరించాలని కోరారు.

దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థ కూడా సాధించని వృద్ధిని సింగరేణి సంస్థ గత 5 ఏళ్లలో సాధించిందని, అలాగే ఎక్కడాలేనన్ని సంక్షేమ పథకాలు ఇక్కడ అమలు జరుపుతున్నామన్నారు.గుర్తింపు కార్మిక సంఘంతో కొత్త క్యాడర్ స్కీం, బదిలీ రెగ్యురైజేషన్, అలవెన్సుల పెంపుదల వంటి వాటిపై చారిత్రక ఒప్పందాలు జరిగాయనీ, ఒప్పందాల్లో అన్ని అంశాలు వెంటనే అమలు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశంపై పలు సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని వివరించారు. ఇప్పటికే మెడికల్ బోర్డు ద్వారా అన్ఫిట్ అయిన కార్మికుల వారసులు దాదాపు 5 వేల మందికి ఉద్యోగాలివ్వడం జరిగిందనీ, స్వంత గృహల నిర్మాణానికి 10 లక్షల ఋణంపై వడ్డీ చెల్లింపులో భాగంగా జూన్ జీతంలో వడ్డీ సొమ్ము చెల్లించామనీ, 14,500 గృహాలకు ఇప్పటికే ఎ.సి. కనెక్షన్లు ఇప్పించడం జరిగిందన్నారు.

Singareni C&MD review meeting

సింగరేణిలో లాభదాయక బొగ్గు నిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో ఒరిస్సా, ఛతీస్ఘడ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలో 6 నుండి 10 బ్లాకుల కోసం ప్రయత్నాలు చేస్తున్నామని, ఇవి కేటాయిస్తే రానున్న ఐదేళ్లలో సింగరేణి ఏడాదికి 85 మిలియన్ టన్నుల నుండి 100 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసే స్థాయికి చేరుతుందన్నారు. అయితే రానున్న 5 ఏళ్ల కాలంలో బొగ్గు పరిశ్రమ కొత్త సవాళ్లను ఎదుర్కోనున్నదని, 50కి పైగా ప్రైవేటు బొగ్గు సంస్థలతో సింగరేణి, కోలిండియా సంస్థలు పోటీ పడాల్సి వస్తుందనీ, కనుక ఉత్పత్తి వ్యయం భారీగా తగ్గించుకుంటేనే మార్కెట్టులో నిలబడి మనుగడ సాధిస్తామని సోదాహరణంగా వివరించారు.

సింగరేణి సంస్థ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని థర్మల్ విద్యుత్ తో పాటు సోలార్ విద్యుత్తును కూడా ఉత్పత్తి చేయడానికి రంగం సిద్ధం చేశామనీ, ఈ ఏడాది చివరికల్లా 130 మెగావాట్లు, వచ్చే ఏడాది మరో 80 మెగావాట్ల సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి సన్నాహాలు చేశామన్నారు. కార్మికులకు కూడా కంపెనీకి సంబంధించిన వాస్తవాలు వివరించాలనీ, తద్వారా నిర్మాణాత్మక ఆలోచనలతో కంపెనీని ముందుకు తీసుకుపోవాలని కార్మికులకు, కార్మిక సంఘాలకు పిలుపునిచ్చారు.

Singareni C&MD review meeting

గుర్తింపు కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బి.వెంకట్రావు, జనరల్ సెక్రటరీ మిరియాల రాజిరెడ్డిలు మాట్లాడుతూ దేశంలో నెంబర్-1గా నిలిచిన సింగరేణిని ఇలాగే ముందుకు తీసుకెళ్లడంలో కార్మికులను సమాయత్తం చేస్తామన్నారు. సమస్యల పరిష్కారం విషయంలో యాజమాన్యం కూడా ఉదారంగా వ్యవహరించాలని కోరారు. గత స్ట్రక్చర్డు సమావేశంలో చర్చించిన అంశాలలో మిగిలిన వాటి మీద తొలుత చర్చించారు. అనంతరం సమావేశంలో 6 ప్రధాన అంశాలపై చర్చ సాగింది.

పెర్కు మీద ఇన్కంటాక్స్ రీ-ఇంబర్సుమెంట్, సర్ఫేస్కు అన్ఫిట్ మీద వచ్చిన ఉద్యోగులకు డిపెండెంట్ ఉద్యోగాల అవకాశం ఇవ్వడం గురించి, సి.పి.ఆర్.ఎం.ఎస్. స్కీంకు డబ్బు చెల్లింపును కార్మికుని ఇష్టానికి వదిలేయాలని, 2000 సంవత్సరం తరువాత డిస్మిస్, గైర్హాజరు ద్వారా తొలగించబడిన వారికి ఒక్క అవకాశంగా ఉద్యోగావకాశం కల్పించాలనీ, ఉన్నత చదువులకు, పరీక్షకు ‘‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’’ అవసరం లేకుండా అనుమతించాలనీ రిటైరైన కార్మికులు తమ క్వార్టర్లను ఖాళీ చేయడానికి 15 రోజులకు బదులు 3 నెలల సమయం ఇవ్వాలని కార్మిక నాయకులు తమ డిమాండ్లను వివరించారు. ఈ సమస్యల పరిష్కారంపై సాధ్యాసాధ్యాలపై డైరెక్టర్లు, కార్మిక సంఘాల నాయకులు చర్చించారు.

సమావేశంలో సిఅండ్‌ఎం.డి. ఎన్.శ్రీధర్‌తో పాటు డైరెక్టర్లు ఎస్.శంకర్ (డైరెక్టర్ ఇ&ఎం),ఎస్.చంద్రశేఖర్ (డైరెక్టర్ ఆపరేషన్స్&పా), బి.భాస్కర్రావు (డైరెక్టర్ పి&పి), ఎన్.బలరాం (డైరెక్టర్ ఫైనాన్స్), జి.ఎం. పర్సనల్ (ఇండస్ట్రియల్ రిలేషన్స్) ఎ.ఆనందరావు, వివిధ విభాగాల జి.ఎం.లు, గుర్తింపు కార్మిక సంఘం నుండి అధ్యక్ష కార్యదర్శులు శ్రీ బి.వెంకట్రావు, ఎం.రాజిరెడ్డి, సెంట్రల్ కమిటీ సభ్యులు దేవ వెంకటేశం, కె.సత్యనారాయణ రెడ్డి, ఎస్.శ్రీనివాసరెడ్డి, కాపుక్రిష్ణ, కె.వీరభద్రయ్య, ఇ.రవీందర్,పెద్దపల్లి సత్యనారాయణ, డి.మంగీలాల్ పాల్గొన్నారు.

- Advertisement -