మహాకూటమికి ఓటుతో బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు ఎంపీ కవిత. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో పలు గ్రామాల్లో పర్యటించిన కవిత…టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలంటే కారు గుర్తుకే ఓటేయాలని తెలిపారు.
గత ప్రభుత్వాలు ఇల్లు కట్టుకోవడానికి రూ. 70 వేలు మంజూరు చేస్తే అందులో రూ. 20 వేలు లబ్దిదారులు చెల్లించాల్సి వచ్చేదని తెలిపారు. బ్యాంకు ద్వారా పొందిన రూ.50 వేల రుణం కోసం బ్యాంకు వాళ్ళు దర్వాజలు తీసుకెళ్లిన పరిస్థితి ఉండేదన్నారు. ఈ పరిస్థితిని గమనించిన కేసీఆర్ పైసా చెల్లించకుండానే ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం చేస్తున్నారని తెలిపారు.
మీ ఇల్లు మీరే కట్టుకోండి ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని.. జాగాలు ఉన్నవాళ్లు ఇల్లు స్వయంగా మీరే కట్టుకునేందుకు ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలను ఇస్తుందన్నారు. దూపల్లిలో మంజూరైన 50 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని వెల్లడించారు.
విపక్షాలు మహాకూటమిగా ఏర్పడి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణలో ఏం పని అని ప్రశ్నించిన కవిత కూటమి నేతలను ఓటుతో తరిమికొట్టాలన్నారు.