దుబాయ్ నుండి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ప్లైదుబాయ్ (FlyDubai) ప్రయాణీకుల విమానంలో కాక్‌పిట్ లోపల కెప్టెన్‌పై దాడి జరగడంతో ఆ విమానాన్ని కూల్చివేసేందుకు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను రంగంలోకి దించినట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 150 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు ఉన్నప్పటికీ, 9/11 తరహా ఉగ్రదాడి జరగవచ్చనే భయంతో ఇజ్రాయెల్ అత్యవసర ప్రోటోకాల్‌ను యాక్టివేట్ చేసింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ప్లైదుబాయ్ ఫ్లైట్ 1073 విమానంలో కో-పైలట్ అకస్మాత్తుగా కెప్టెన్‌పై చాకుతో దాడి చేసి, విమానాన్ని కిందకు కూల్చేందుకు (క్రష్ చేయడానికి) ప్రయత్నించాడు. ఈ క్రమంలో విమానం ఒక్కసారిగా 14,000 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయింది.
కాక్‌పిట్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ అప్రమత్తమైంది. ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థ వెంటనే చర్యలు చేపట్టి తమ వ్యూహాత్మక ప్రాంతాలను, ప్రయాణికుల విమానాశ్రయాన్ని కాపాడుకునేందుకు యుద్ధ విమానాలను గాల్లోకి పంపింది. అలాగే తమ వైమానిక ప్రాంతాన్ని (Airspace) మూసివేసింది.
అయితే, ఇజ్రాయెల్‌కు దాదాపు 400 మైళ్ల దూరంలో ఉండగానే ఆ విమానం సౌదీ అరేబియా వైపు మళ్లడంతో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు వెనక్కి తగ్గాయి. ఆ తర్వాత సౌదీ అరేబియా తమ ఫైటర్ జెట్‌లను రక్షణగా పంపింది. కెప్టెన్ తీవ్రంగా గాయపడినప్పటికీ ధైర్యంగా కో-పైలట్‌ను నిరోధించి కాక్‌పిట్ తలుపులు తెరిచాడు. వెంటనే విమానంలోని ఇజ్రాయెల్ ప్రయాణికులు, ప్లైదుబాయ్ సిబ్బంది కాక్‌పిట్‌లోకి చొరబడి కో-పైలట్‌ను లొంగదీసుకున్నారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు ఆఫ్ డ్యూటీ పైలట్లు విమానం నియంత్రణను తమ చేతుల్లోకి తీసుకుని, సౌదీ అరేబియాలోని తబుక్ (Tabuk) విమానాశ్రయంలో సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
Also Read:స్విట్జర్లాండ్ అధ్యక్షుడితో మోదీ
ఈ దాడికి ఒమాన్ దేశానికి చెందిన కో-పైలట్ హమామ్ అల్ హమామి కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. యూఏఈ అధికారుల విచారణలో ఆయన తాను ఈ దాడిని ప్లైదుబాయ్‌లో చేరకముందే ప్లాన్ చేసినట్లు అంగీకరించాడు. ఇజ్రాయెల్‌లోని బెన్ గురియోన్ విమానాశ్రయంపై విమానాన్ని ఢీకొట్టించి భారీ విధ్వంసం సృష్టించడమే అతని లక్ష్యమని తెలిసింది.

